Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై వీహెచ్ పి ఇచ్చిన కంప్లైంట్ లో ఏముంది?

By:  Tupaki Desk   |   18 March 2019 5:32 PM GMT
కేసీఆర్ పై వీహెచ్ పి ఇచ్చిన కంప్లైంట్ లో ఏముంది?
X
త‌న‌కు తోచిన‌ట్లుగా మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అల‌వాటే. ఆవేశం వ‌చ్చినప్పుడు.. ఆగ్ర‌హంలో ఉన్న‌ప్పుడు కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చే మాట‌ల్లో తీవ్ర‌త ఒక రేంజ్లో ఉంటుంది. ప్ర‌త్య‌ర్థుల్ని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా తిట్టే అల‌వాటున్న కేసీఆర్ ను.. ఎందుక‌లా తిడ‌తారు? తిట్లు స‌రికావంటే.. అరే.. భ‌య్ అవ‌న్నీ మామూలుగా మాట్లాడుకునేవే అంటూ తేలిగ్గా చెప్పేస్తారు. త‌న‌ను ఎవ‌రైనా ఒక్క మాట అంటే.. ఆ మాట యావ‌త్ తెలంగాణ స‌మాజాన్ని అన్న‌ట్లుగా ఆపాదించే తెలివి ఉన్న కేసీఆర్‌.. అదే స‌మ‌యంలో త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ఉద్దేశించి ఎంత తీవ్ర‌త‌తో మాట్లాడ‌తార‌న్న దానికి నిద‌ర్శ‌నంగా తాజాగా జ‌రిగిన క‌రీంన‌గ‌ర్ బ‌హిరంగ స‌భ‌ను ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు.

ఈ స‌భ‌లో ప్ర‌ధాని మోడీ పైన.. కాంగ్రెస్ అధినేత రాహుల్ మీద విరుచుకుప‌డిన వైనం అంద‌రూ మాట్లాడుకునేలా చేసింది. ప్ర‌ధాని మోడీని గౌర‌వించాలంటూ గ‌తంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు విరుద్ధంగా మోడీని తిట్టిపోశారు. అంతేకాదు.. హిందువుల‌ని చెప్పుకునే వారితో పోలిస్తే.. తానే పెద్ద హిందువున‌ని.. తాను చేసిన‌న్ని యాగాలు దేశంలోని మ‌రే ముఖ్య‌మంత్రి చేయ‌లేద‌న్న మాట‌ను గొప్ప‌గా చెప్పుకున్నారు.

అదే స‌మ‌యంలో.. హిందూగాళ్లు.. బొందుగాళ్లు.. దిక్కుమాలిన ద‌రిద్రుల చేతిలో దేశం ఉందంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై విశ్వ‌హిందూ ప‌రిష‌త్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తుంది. తాజాగా కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ ఎన్నిక‌ల సంఘానికి వీహెచ్ పీ ఫిర్యాదు చేసింది. హిందువుల‌ను అవ‌మానించేలా మాట్లాడిన కేసీఆర్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నిక ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్ కు వీహెచ్ పీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల సీడీని అందించిన‌ట్లు చెబుతున్నారు.

కేసీఆర్ త‌న ప్ర‌సంగంలో అత్యుత్త‌మ న్యాయ‌స్థానాన్ని ఉద్దేశించి మాట్లాడార‌ని.. ఆయ‌న మాట‌లు కించ‌ప‌రిచేలా ఉన్న‌ట్లు వారు పేర్కొన్నారు.జాతీయ స‌మ‌గ్ర‌త‌కు భంగం క‌లిగేలా మాట్లాడిన కేసీఆర్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వీహెచ్ పీ కోరింది. ఈ నేప‌థ్యంలో కరీంన‌గ‌ర్ స‌భ‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నివేదిక ఇవ్వాల‌ని.. అది వ‌చ్చిన త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లుగా ర‌జ‌త్ కుమార్ చెప్పారంటూ వీహెచ్ పీ నేత‌లు చెబుతున్నారు. మంట పుట్టేలా మాట్లాడే అల‌వాటున్న కేసీఆర్ కు.. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇబ్బందిక‌రంగా మార‌తాయా? అన్న‌ది కాల‌మే చెప్పాలి.