Begin typing your search above and press return to search.

వీహెచ్ బరిలోకి దిగితే రచ్చరచ్చేనంట

By:  Tupaki Desk   |   27 May 2016 5:03 AM GMT
వీహెచ్ బరిలోకి దిగితే రచ్చరచ్చేనంట
X
బలం లేకున్నా..గెలిచే అవకాశం అసలే లేకున్నా బరిలోకి దిగుతున్నారంటే దానికి ఏదో ఒక కారణం ఉండకుండా ఉండదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. గెలిచే అవకాశం లేకున్నా.. ఓటమితో అధినాయకత్వం దృష్టిలో సానుభూతి మార్కులు వేయించుకోవాలన్న ఆలోచనతో పాటు.. తెలంగాణ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టటం.. రాజ్యాంగపరమైన అంశాలతో రచ్చ చేయటానికి ఉన్న అవకాశాన్ని చేజార్చుకోకూడదన్న భావనలో వీహెచ్ అండ్ కో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలతో రెండు రాజ్యసభ స్థానాల్ని సొంతం చేసుకోవటం కష్టమేమీ కాదు. కానీ.. విపక్షాలన్నీ కలిసినా గెలిపించే అవవకాశం లేకున్నా.. కాంగ్రెస్ పార్టీ తరఫున వీహెచ్ బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆంగీకారం కోసం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని సంప్రదించినట్లుగా వీహెచ్ చెప్పటం తెలిసిందే.

ఒకవేళ సోనియమ్మ కానీ వీహెచ్ అభ్యర్థిత్వానికి ఓకే అంటే తెలంగాణ రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. వీహెచ్ కానీ బరిలోకి దిగితే.. పార్టీ జంప్ అయిన వారిని ఇరికించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ కు తగినంత బలం లేకున్నా.. విపక్షాల మద్దతు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే.. అందరి ఓట్లు కలిపినా వీహెచ్ విజయం సాధించేందుకు వీల్లేదు. అయితే.. గెలుపు కన్నా కూడా తెలంగాణ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టటానికే వీహెచ్ బరిలోకి దిగాలని భావిస్తున్నట్లుగా చెప్పొచ్చు.

అదెలానంటే.. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలు తాము తమ పార్టీల్ని అధికారిక టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసేసుకోవటం జరిగిపోయాయి. అయితే.. కాంగ్రెస్ నుంచి గోడ దూకిన ఎమ్మెల్యేల విషయంలో విప్ జారీ చేసి వారిపై చర్యలకు పట్టుబట్టే అవకాశం రాజ్యసభ ఎన్నిక ద్వారా లభిస్తుందన్న అభిప్రాయం ఉంది. పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలకు పట్టుబట్టే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణలో జరిగే రాజ్యసభ ఎన్నిక రచ్చ కావటం ఖాయం. మరి.. ఇందుకు సోనియమ్మ సమ్మతిస్తారా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.