Begin typing your search above and press return to search.

తెలంగాణకు వైఎస్ ఎంత అన్యాయం చేసిండు భయ్

By:  Tupaki Desk   |   2 May 2016 4:15 AM GMT
తెలంగాణకు వైఎస్ ఎంత అన్యాయం చేసిండు భయ్
X
కాలం మహా చెడ్డది. సలాం కొట్టిన చేతినే లాగి పెట్టి కొట్టేలా చేస్తుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నేతగా చెలరేగిపోతున్న వైఎస్ మీద మాట అనటానికి ఏ మాత్రం ఇష్టపడని నేతలు.. వైఎస్ తీసుకున్న నిర్ణయాల్ని సమర్థించేందుకు పోటాపోటీ పడిన నేతలు.. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో తెలిసిందే. వైఎస్ మరణం సందర్భంగా ఆయనలాంటి మహా నేత ఎవరూ ఉండరంటూ గుక్కతిప్పుకోకుండా చెప్పటమేకాదు.. కన్నీరుమున్నీరుగా ఏడ్వటం టీవీల్లో చాలామందే చూసి ఉంటారు. అలా శోకాలు పెట్టిన నేతల్లో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఒకరు.

అలాంటి వీహెచ్ దివంగత వైఎస్ మీద చేస్తున్న తాజా వ్యాఖ్యలు చూస్తే.. కాలం ఎంత సిత్రమైందని అనుకోవాల్సిందే. తెలంగాణకు వైఎస్ వల్ల చాలానే అన్యాయం జరిగిందని చెబుతున్న వీహెచ్.. పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు నష్టం కలిగించారన్నారు. ఇప్పుడు అదే వైఎస్ కుమారుడు జగన్.. పాలమూరు.. డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని ప్రకటించటం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు.

పోతిరెడ్డిపాటు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్దనరెడ్డి పోరాడితే ఆయన్ను వైఎస్ రాజకీయంగా.. మానసికంగా హింసించారని చెప్పుకొచ్చారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది వైఎస్సేనని.. ఇప్పుడు చంద్రబాబు.. కేసీఆర్ అదే బాటలో నడుస్తున్నారని వీహెచ్ ధ్వజమెత్తారు. మరి.. ఇప్పుడు అన్ని మాటలు చెబుతున్న వీహెచ్.. నాడు వైఎస్ ను ఆకాశానికి ఎత్తేయటం ఏమనాలి? పోతిరెడ్డిపాడు మీద వైఎస్ ను విమర్శలు చేసే హక్కు ఎవరికైనా ఉందంటే అది.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి మాత్రమే ఉందని చెప్పాలి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద పీజేఆర్ తో కలిసి.. ఒంటరిపోరు చేసింది మర్రి శశిధర్ రెడ్డి మాత్రమే తప్ప మరెవరూ కాదు. హైదరాబాద్ బ్రదర్స్ గా కీర్తించే పీజేఆర్..శశిధర్ రెడ్డిలు పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తూ వైఎస్ మీద అలుపెరగని పోరాటం చేశారు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నవీహెచ్.. అప్పుడెలా వ్యవహరించారో అందరికి తెలిసిందే. కొన్ని విషయాల్నివీహెచ్ మర్చిపోవచ్చేమో కానీ.. అందరూ మరవరు కదా..?