Begin typing your search above and press return to search.

జంపర్స్ కుక్కబుద్ధికి సుప్రీం చెప్పుదెబ్బ?

By:  Tupaki Desk   |   6 May 2016 2:35 PM GMT
జంపర్స్ కుక్కబుద్ధికి సుప్రీం చెప్పుదెబ్బ?
X
పోలిక కాస్త ఇబ్బందిగా ఇది నిజం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి.. మరో పార్టీలోకి జంప్ అయిపోవటం ఇప్పుడో అలవాటుగా మారింది. గతంలో పార్టీ మారటమంటే నేతలు కిందామీదా పడేవారు. సముచిత కారణం ఉన్నా.. సరైన పద్ధతి కాదని భావించినోళ్లు ఎంతోమంది ఉన్నారు. కానీ.. డిజిటల్ యుగానికి తగ్గట్లే నేతలు సైతం మారిపోయారు. విలువలకు తిలోదకాలు ఇవ్వటం.. ఎక్కడ ప్రయోజనం ఉంటే ఆ పార్టీలోకి వెళ్లేందుకు పెద్దగా ఆలోచించని తత్వం రోజురోజుకీ పెరుగుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారపక్షాల్ని చూస్తే.. చంద్రుళ్ల ఇద్దరూ ఇద్ధరే అనిపించక మానదు. విపక్షాలన్నవి ఉండకూడదన్నట్లుగా చంద్రుళ్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించరు. ఇలాంటి అంశాలు తప్పు అని తెలిసినా ఎవరూ నోరు విప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఇలాంటి జంపర్స్ సాయంతో కేంద్రంలోని మోడీ సర్కారు.. వివిధ రాష్ట్రాల్లో తన పట్టు పెంచుకునే ప్రయత్నాన్ని షురూ చేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని తన వైపునకు తిప్పుకొని అధికారాన్ని చేజిక్కించుకునే ప్లాన్ ఉత్తరాఖండ్ లో వర్క్ వుట్ కాని పరిస్థితి.

కోర్టు జోక్యంతో ఇప్పటికే తల బొప్పి కట్టిన బీజేపీ నేతలకు తాజాగా సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయ లాంటి నిర్ణయం ఒకటి తీసుకుంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ నేతృత్వంలోని ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు మే 10న ముహుర్తం పెట్టింది. బలనిరూపణకు డేట్ ఫిక్స్ చేసిన సుప్రీం ఒక ఆసక్తికర మెలిక పెట్టింది. జంపింగ్స్ తో అనర్హత వేటు పడిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలనిరూపణ పరీక్షలో పాల్గొనకూడదని పేర్కొంది. ఈ నిర్ణయంతో కమలనాథుల గొంతులో పచ్చి వెలక్కాయ పడిన పరిస్థితి. జంపర్స్ తో తాను అనుకున్న రీతిలో రావత్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని భావించిన కమలనాథులకు.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏం చేయాలో తోచని పరిస్థితి. బలపరీక్షలో జంపర్స్ ఓటుహక్కు లేని నేపథ్యంలో బలపరీక్షలో విపక్షం తన అధిపత్యాన్ని నిలుపుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా మోడీ కి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడటం ఖాయం.