Begin typing your search above and press return to search.

నెస్లేకు మరో దెబ్బ.. పాస్తాలోనూ రసాయనాలు

By:  Tupaki Desk   |   28 Nov 2015 7:40 AM GMT
నెస్లేకు మరో దెబ్బ.. పాస్తాలోనూ రసాయనాలు
X
దేశంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. మరెన్నో ఉత్పత్తులు చేస్తున్నాయి. మరే కంపెనీకి తగలనన్ని షాకులు నెస్లే మాత్రం వరుసగా తగులుతున్నాయి. దేశవ్యాప్తంగా టూ మినిట్స్ మ్యాగీ పేరుతో సుపరిచితమైన బ్రాండ్ కు తగలకూడనంత భారీ దెబ్బ తగిలిన విషయం తెలిసేందే. ప్రమాదకర రసాయనాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బ్యాన్ కు గురై.. వేలాది కోట్ల రూపాయిల వ్యాపారాన్ని పోగొట్టుకొని.. భారీగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తగిలించుకున్న మ్యాగీ.. కిందామీదా పడి ఈ మధ్యనే మళ్లీ రీలాంఛ్ అయ్యింది.

మ్యాగీ రీలాంఛ్ తో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న నెస్లేకు ఊహించని మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ అమ్మే పాస్తా ఉత్పత్తిలోనూ నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా సీసం స్థాయి ఎక్కువ ఉందన్న విషయం తాజా పరీక్షల్లో తేలింది. ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లు జరిపిన పరీక్షల్లో సాధారంగా ఉండాల్సిన 2.5పీపీఎం సీసం మోతాదుకు మించి 6 శాతం పీపీఎం ఉందని తేలింది.

దీంతో.. నెస్లే పాస్తా పై మరోసారి పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో.. ఈ కంపెనీకి తాజాగా నోటీసులు ఇచ్చేందుకు రెఢీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి నిర్వహించనున్న పరీక్షల్లో కానీ.. సీసం మోతాదు ఎక్కువగా ఉందని తేలితే మాత్రం నెస్లేకు భారీ దెబ్బ ఖాయమంటున్నారు.