‘కేటీఆర్ నువ్వో బచ్చా.. నీకా స్థాయి లేదు..’

Mon Jul 17 2017 10:39:08 GMT+0530 (IST)

ఆచితూచి మాట్లాడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ ఆగ్రహం వస్తే ఆయన్ను.. ఆయన మాటల్ని ఆపటం అంత తేలికైన ముచ్చట కాదు. ఆ సందర్భంలో రాజకీయ ప్రత్యర్థులపై ఆయన మాటలు తూటాల్లా పేలుతాయి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే ఆయన తీరుకు.. రాజకీయ నేతలు నోరు విప్పేందుకు సైతం జంకుతారు. అలాంటి కేసీఆర్ పై పెద్ద ఎత్తున ఫైర్ కావటం అంత చిన్న ముచ్చట కాదు.

రాజకీయంగా తండ్రి వారసత్వాన్ని కోరుకుంటూ.. ఆయన తర్వాత తానే వారసుడినన్న విషయాన్ని ప్రతి విషయంలోనూ ఫ్రూవ్ చేసుకుంటున్న మంత్రి కేటీఆర్.. ఇటీవల కాలంలో కాంగ్రెస్ మీద విమర్శలు చేసే విషయంలో మరింత డోస్ పెంచారు. తన తండ్రి తరహాలో కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై తన తండ్రి మాత్రమే కాదు.. తాను కూడా అదే రీతిలో మండిపడగలనన్న విషయాన్ని తన మాటలతో ఫ్రూవ్ చేసుకునే పనిలో పడ్డారు కేటీఆర్.

ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆరే అనుకుంటే.. ఆయన కుమారుడు సైతం తమ పార్టీని విమర్శలతో బంతాట ఆడుకుంటున్న వైనంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఆయన మంత్రి కేటీఆర్ పై  తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ చేస్తున్న విమర్శలకు ఘాటు కౌంటర్ అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. కాంగ్రెస్ పై ఒంటికాలితో విరుచుకుపడుతున్న కేటీఆర్ పై శివాలెత్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పరుషంగా మాట్లాడిన ఆయన.. తనలోని మరో కోణాన్ని ప్రదర్శించారని చెప్పక తప్పదు.

‘కేటీఆర్ నువ్వో బచ్చా... కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి నీకు లేదు. నోరు అదుపులో పెట్టుకో..’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మీద నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదన్నారు. విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలని.. తొందరపడి చేయకూడదన్న హితవు పలికిన ఆయన.. మంత్రి కేటీఆర్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఇక.. పోలీసుల మీదా ఉత్తమ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

టీఆర్ ఎస్ సర్కారు హయాంలో పోలీసులు గులాబీ చొక్కాలు వేసుకున్న విధంగా కాంగ్రెస్ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నట్లుగా ఆరోపించారు.  ఇటీవల వరంగల్ కార్పొరేటర్ హత్య పాతకక్షలతో అని నిందితులు లొంగిపోయినా.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు బనాయించటం తప్పన్నారు. త్యాగాలతో కూడుకున్న పార్టీ కాంగ్రెస్ అని.. తెలంగాన రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు.