Begin typing your search above and press return to search.

పొగ‌డ్త‌లు త‌ప్ప కేసీఆర్‌ కు మిగిలిందేమీ లేదు

By:  Tupaki Desk   |   20 Feb 2018 3:17 PM GMT
పొగ‌డ్త‌లు త‌ప్ప కేసీఆర్‌ కు మిగిలిందేమీ లేదు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అర‌వింద్ కేసీఆర్‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన - బాలింతలకు కేసీఆర్ కిట్ - భారీ ఎత్తిపోతల పథకాలు - రైతులకు పంట పెట్టుబడిలాంటి కార్యక్రమాలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనంచేసి - అమలుచేయాలని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్ర‌శంస‌ల‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సెటైర్ వేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఉత్త‌మ్ కిట్స్ బాగున్నాయో - కిడ్స్ బాగున్నార‌న్నారో తెలియడం లేర‌ని ఎద్దేవా చేశారు. అరుణ్ జైట్లీ - అరవింద్ సుబ్రహ్మణ్యంలతో ఆహా ఓహోలు తప్ప చేసింది ఏమీలేదని వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా కొత్త పాయింట్ ఆధారంగా కేసీఆర్‌ పై ఉత్త‌మ్ మండిప‌డ్డారు. తెలంగాణ బిల్లు పాస్ అయి నాలుగేళ్లు పూర్తయ్యింద‌ని...ఈ నాలుగేళ్లలో ఒక్క విభజన హామీని కేసీఆర్ సాధించలేకపోయారని ఆరోపించారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల కల చెదిరిందని తెలిపారు. అప్రజాస్వామిక పాలన సాగుతోంద‌ని మండిప‌డ్డారు. విభజన బిల్లులో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ - రైల్వ్ కోచ్ ఫ్యాక్టరీలకు ఒక్క ఇటుకనైనా వేశారా అని ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీతో కొట్లాడే దమ్ములేదు కేసీఆర్ కు లేదని ఉత్త‌మ్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ కోసం పోరాడిన వారందరు కేసీఆర్ పాలనలో నిరాశగా ఉన్నారని ఉత్త‌మ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆ నలుగురు సంతోషంగా ఉంటూ నాలుగు కోట్ల మందిని ఆవేద‌న‌లో ముంచార‌ని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు అందలం ఎక్కించార‌ని ఉద్య‌మ‌కారుల‌కు ఆవేద‌న మిగిల్చార‌ని ఆరోపించారు. దేశంలో సచివాలయంకు రాని సీఎం కేసీఆర్ ఒక్కడేనని అన్నారు. కేసీఆర్‌ కు ఇదే ఆఖరి బడ్జెట్ అని ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికి వెళ్లడం ఖాయమ‌ని జోస్యం చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని భావిస్తున్నామ‌న్నారు. ఫిబ్రవరిలోపు కేసీఆర్ దుర్మార్గపు పాలనా అంతమవుతుందని పేర్కొన్నారు. ఎంఐఎంపై అన్నీ చోట్ల పోటీచేయాలని హైకమాండ్ నిర్ణయించిందని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. డీసీసీ అధ్య‌క్షులు ఎన్నికల్లో పోటీచేయని వారుండాలని అధిష్టానం నిర్ణయం అని వివ‌రించారు. కొత్త ఏఐసీసీ మెంబర్లలో యువతకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

కాంగ్రెస్ బస్ యాత్రకు సహకరించాలని మీడియాను కోరుతున్నామ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీలో అందరి సలహాలు - అభిప్రాయాలతోనే బస్సు యాత్ర చేస్తున్నామ‌ని ఏకపక్షం అని ఎవరైన అంటే అది తప్పు అని ఉత్త‌మ్ అన్నారు. ఇప్పుడు ప్రకటించిన పాదయాత్రలన్నీ అధిష్టానం నిర్ణయమేన‌ని అన్నారు. మహిళలు - యువత - రైతులు - విద్యార్థులతో యాత్రలో ఇష్టాగోష్టి ఉంటుందని పేర్కొన్నారు. బస్ యాత్రలో అన్ని పార్టీలనుండి చేరికలు ఉంటాయని వీరిలో పెద్దనాయకులు ఉంటారని వివ‌రించారు. దళితులకు మూడు ఎకరాల హామీని నిలబెట్టుకోవాలని, దళితులకు భూమి ఇవ్వలేకపోతే...ప్రతి ఇంటికి 15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూన్ ఒకటిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటార‌ని వివ‌రించారు.