Begin typing your search above and press return to search.

కేసీఆర్ గుట్టు గురువారం బయటపెడతారట

By:  Tupaki Desk   |   24 Aug 2016 5:07 PM GMT
కేసీఆర్ గుట్టు గురువారం బయటపెడతారట
X
బస్తీమే సవాల్ అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పై సవాల్ చేయటం తెలిసిందే. తుమ్మడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి ఉత్తమ్ చేసిన ఆరోపణల్ని నిరూపించినపక్షంలో తాను బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచే నేరుగా రాజ్ భవన్ వెళ్లి.. తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసిన కేసీఆర్ సవాల్ పై ఉత్తమ్ స్పందించారు. తనపైనా.. తెలంగాణ కాంగ్రెస్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైనంపై స్పందించిన ఆయన.. మహారాష్ట్ర సర్కారుతో కేసీఆర్ చేసుకొచ్చింది మహా ఒప్పందం కానే కాదని.. పెద్ద దగాగా ఉద్ఘాటించారు. మహారాష్ట్రతో చేసుకున్న మహా ఒప్పందంలోని కుట్రల్ని తాను రేపు (గురువారం) బయటపెడతానని ఉత్తమ్ ప్రకటించారు.

కేసీఆర్ చెబుతున్నవి కాకి లెక్కలుగా తేల్చిన ఉత్తమ్.. కేసీఆర్ చేసే బెదిరింపులకు తాను భయపడనని.. తాను సైన్యంలో పని చేసిన వచ్చానన్నారు. ప్రాజెక్టులపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పిన ఉత్తమ్.. కేసీఆర్ చేసుకొచ్చింది మహా దగా ఒప్పందంగా అభివర్ణించారు. టెండర్ల ప్రక్రియలో అవినీతిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన ఉత్తమ్.. విపక్షాన్ని లేకుండా చేస్తామని కేసీఆర్ చెప్పటం ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనంగా అభివర్ణించారు.

తెలంగాణను తాకట్టు పెట్టి సంబురాలు చేసుకుంటున్నారా? అంటూ తీవ్రస్వరంతో ప్రశ్నించిన ఆయన.. విమర్శలు చేసిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతానని చెప్పటం దిగజారుడుతనంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్ లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అంత ఘాటుగా కాకున్నా.. తనదైన శైలిలో ఉత్తమ్ రియాక్ట్ అయ్యారని చెప్పొచ్చు.