ఉత్తమ్ కొత్త స్కెచ్ తో కేసీఆర్ కు కలవరమేనా?

Tue Oct 23 2018 22:31:21 GMT+0530 (IST)

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుతోంది. అపద్ధర్మ సర్కారుకు సారథ్యం వహిస్తున్న టీఆర్ ఎస్ ను ప్రతిపక్షమైన కాంగ్రెస్ ధీటుగా టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో తమకు అందివస్తున్న అవన్ని అవకాశాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంటోంది. ఇదే రీతిలో తాజాగా విద్యార్థులను అక్కువ చేర్చుకుంటోంది. ప్రధానంగా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో టీఆర్ ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు పోలేని స్థితిని ప్రస్తావిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ దూకుడు పెంచుతున్నారు. తాజాగా పాలమూరు - కాకతీయ - జె.ఎన్.టి. యూ తదితర విశ్వవిద్యాలయాల విద్యార్థులకు పార్టీ కండువా కప్పి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది కీలక పాత్ర - అటువంటి విద్యార్థులను సీఎం కేసీఆర్ - మంత్రి కేటీఆర్ మోసం చేశారన్నారు. డిసెంబర్ 12న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ లక్ష ఉద్యోగాల్లో 20 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. స్వయం ఉపాధి - ప్రైవేటు  రంగం ద్వారా మరో లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. నిరుద్యోగులకు 3వేల భృతిని ప్రకటిస్తాం అని ఉత్తమ్ తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో ప్రయివేటు యూనివర్సిటీలు ఉండవు. ఉస్మానియా - కాకతీయ యూనివర్సిటీలను బలోపేతం చేస్తాం అని ఉత్తమ్ కుమార్ అన్నారు. ఒక్కొక్క విద్యార్ధి 100 ఓట్లు వేయించాలి అని కోరారు. ప్రతి విద్యార్థి - నిరుద్యోగి 100 ఓట్లు వేయిస్తా అని మాట ఇవ్వండి అని ఉత్తమ్ అన్నారు. డబ్బు - మద్యంతో ఎన్నికలలో గెలవాలని తెరాస చూస్తోందన్నారు. మీము ఇచ్చిన హామీలకు 16 రూపాయలు పెంచి ప్రకటించారు అని విమర్శించారు. నాలుగేండ్ల అధికారంలో ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ముందు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న ఉద్యోగాల ఖాళీలు కూడా భర్తీ చేయని ప్రభుత్వంలోని పెద్దలను సన్నాసులు అనాలా? దద్దమ్మలు అనాలాలో? అర్ధం కావడంలేదన్నారు.

తెలంగాణ వచ్చాక  కేసీఆర్ కు దోచుకోవడం దాచుకోవడమే పని అయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. లక్ష చదరపు అడుగుల్లో కేసీఆర్ ఇల్లు కట్టుకున్నాడు. విమానాల్లో మనం టికెట్లు కొని ప్రయనిస్తున్నాం.. కానీ కేసీఆర్ ఏకంగా విమానాలే బుక్ చేసుకుంటున్నారన్నారు. ప్రజాకుటమి అధికారంలోకి వస్తుందని వారికి లాగులు తడుస్తున్నాయని ఉత్తమ్ కుమార్ అన్నారు. ఆంధ్రా పాలకుల కంటే ఎక్కువ దోచుకుంది కేసీఆర్ కుటుంబం అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.