Begin typing your search above and press return to search.

దెబ్బకు దెబ్బ. రేవంత్ వర్సెస్ ఉత్తమ్..

By:  Tupaki Desk   |   21 Sep 2018 10:52 AM GMT
దెబ్బకు దెబ్బ. రేవంత్ వర్సెస్ ఉత్తమ్..
X
ఎలాంటి స్థితిలోనైనా ఎప్పుడూ ఒకేలా ఉండేలా ఉండడం కాంగ్రెస్ నైజం అని చెబుతారు.. మహాకూటమి ఏర్పాటు చేసి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు ఆ పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ మాత్రం జోరుగానే సాగుతున్నాయి. ఇప్పుడు రేవంత్ వర్సెస్ ఉత్తమ్ ఎపిసోడ్ కాంగ్రెస్ లో సెగలు పుట్టిస్తోందట.. రేవంత్ కు ఉత్తమ్ ఫిట్టింగ్ పెడితే.. ఉత్తమ్ కి రేవంత్ సెట్టింగ్ పెట్టాడని కాంగ్రెస్ లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో ఎత్తుకు పై ఎత్తు ఎపిసోడ్ యమ జోరుగా సాగుతోందట.. ఉత్తమ్ వర్సెస్ రేవంత్ ఇద్దరూ వారి వారి ఎదుగుదలను అడ్డుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన పదవుల్లో రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఆయన టీడీపీలో ఉండగా అదే పదవిలో ఉన్నారు. దీంతో ఉత్తమ్ పైరవీ చేసి అదే హోదాను కట్టబెట్టారనే ప్రచారం జరిగింది. కానీ రేవంత్ ఆశించింది మాత్రం ప్రచార కమిటీ చైర్మన్ పదవట.. ఈ పదవిని ఖమ్మం జిల్లా నేత మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించారు. తాను ఆశించిన పదవి దక్కకపోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డియే కారణమని ఓ సందర్భంలో రేవంత్ గట్టిగానే ముఖం మీద ఉత్తమ్ ను అడిగేశాడట.. కానీ ఉత్తమ్ మాత్రం రాహుల్ చేతిలో ఉందని తప్పించుకున్నాడట..

ప్రచార కమిటీ చైర్మన్ పదవి అయితే రాష్ట్రమంతా ప్రచారం చేసి గెలుపు బాధ్యతను భుజానా వేసుకుంటే ప్రజల్లో మైలేజ్ తోపాటు కాంగ్రెస్ లో గుర్తింపు ఉంటుందని రేవంత్ భావిస్తున్నాడు. ప్రచారంతో అధికారంలోకి వస్తే సీఎం కావచ్చని కలలుగంటున్నాడు. అయితే ఆ పదవి రాకపోయేసరికి దీని వెనుక ఉత్తమ్ ఉన్నాడని రేవంత్ సన్నిహితుల వద్ద వాపోతున్నాడట..ఉత్తమ్ వల్ల రేవంత్ కు పదవి దక్కలేదన్నది ఆయన అనుచరుల మాట..

ఇక తనకు ప్రచార కమిటీ దక్కకుండా చేసిన ఉత్తమ్ పై రేవంత్ మరో రూట్ లో ప్రతీకారం తీర్చుకుంటున్నాడనే టాక్ నడుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తమ్ కు చెక్ చెప్పాలనే ఉద్దేశంతో మల్లు భట్టి విక్రమార్కకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పజెప్పారనే ప్రచారాన్ని రేవంత్ రెడ్డి వర్గం తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య కుటుంబాన్ని పరామర్శించారు.. ఈసారి కూడా కాంగ్రెస్ గెలిస్తే దళిత ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనతోనే మల్లు భట్టిని సీఎం చేసేందుకే ఆయన ప్రచార కమిటీ పదవి ఇచ్చారని రేవంత్ ప్రచారం చేస్తున్నాడట..

ఇలా ఉత్తమ్ - రేవంత్ రెండు వర్గాలు పదవుల కేటాయింపులపై గ్రూపు రాజకీయాలకు తెరదీసి కాంగ్రెస్ లో గందరగోళం సృష్టిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహాకూటమి పెట్టి బలమైన టీఆర్ ఎస్ ను ఓడించేందుకు కలిసి పనిచేయాల్సిన వీరంతా గ్రూపు రాజకీయాలతో కొట్టుకుంటుండడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచబోతోందని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు.