Begin typing your search above and press return to search.

ఉత్తమ్ టీం జోష్.. టీఆరెస్ తుష్

By:  Tupaki Desk   |   27 Oct 2016 9:42 AM GMT
ఉత్తమ్ టీం జోష్.. టీఆరెస్ తుష్
X
తెలంగాణ కాంగ్రెస్‌ లో సీనియ‌ర్లంతా ఒక్క‌తాటిపైకి వ‌స్తున్నారు. కలిసికట్టుగా ఉంటే త‌ప్ప ప్ర‌భుత్వంపై పోరు చేయ‌లేమ‌న్న సత్యం అర్థమై కాస్త అంతా ఒక దారిలో ప్రయాణిస్తున్నారు. కారణమేదైనా ఈ ప‌రిణామాల‌న్నీ టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి క‌లిసి వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వ ప్రాజెక్టులు - రీడిజైన్ల‌పై ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ తో పార్టీలో ఉత్త‌మ్‌కు ఉన్న ఆద‌ర‌ణ పెరిగింది. ఆ తరువాత మెల్లమెల్లగా సీనియ‌ర్లంతా క‌లిసి రావ‌డం మొద‌లు పెట్టారు. ముఖ్యంగా ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌ - రైతు రుణ‌మాఫీలు తెలంగాణ‌లో మెజారిటీ ప్ర‌జ‌లు అంటే ల‌క్ష‌లమందితో ముడిప‌డి ఉన్న అంశం. ఈ విష‌యాల్లో ప్ర‌భుత్వం అనుస‌రిస్తోన్న జాప్యంపై వ‌రుస నిర‌స‌న‌లు - ఆందోళ‌న‌లు ఉత్త‌మ్‌ కు పార్టీలో మైలేజ్ పెంచేలా చేశాయి.అదే సమయంలో టీఆరెస్ లో మంత్రులు సహా అంతా కొద్దికాలంగా డల్ గా ఉండడంతో ఉత్తమ్ అండ్ టీం జోరు పెంచుతోంది.

నిజానికి ఉత్తమ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అంతా ఎదురుగాలే వీస్తోంది. తెలంగాణ‌లో ఉత్త‌మ్ టీపీసీసీ అధ్యక్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టాక జ‌రిగిన పార్ల‌మెంటు - అసెంబ్లీ - స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎక్క‌డా కూడా కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు. దీంతో ఆయ‌న‌ను త‌ప్పిస్తార‌న్న ఉహాగానాలు చెల‌రేగాయి. చాలామంది పార్టీ నేత‌లు టీపీసీసీ ప‌ద‌వికోసం రేసులో నిలిచారు. కాబ‌ట్టి ఉత్త‌మ్ నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు కొంద‌రు స‌హ‌జంగానే దూరంగా ఉన్నారు. పార్టీలో సీనియ‌ర్లు కూడా ఉత్త‌మ్‌ కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌న‌ను త‌ప్పించాల‌ని అధిష్టానానికి స్వ‌యంగా విన్న‌వించుకున్నాడు. కానీ, అధిష్టానం ఉత్త‌మ్‌ ను కొన‌సాగించేందుకే నిర్ణ‌యం తీసుకుంది. దీంతో సీనియ‌ర్ల వైఖ‌రిలో చాలామార్పు వ‌చ్చింది. ఉత్త‌మ్‌ ను ఇప్ప‌ట్లో త‌ప్పించ‌లేర‌న్న సంకేతాలు సీనియ‌ర్ల‌ను చేర‌డంతో వారంతా మ‌రోదారిలేక ఉత్త‌మ్ వెన‌క న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకే, ఫీజు రీయంబ‌ర్స్‌ మెంట్‌ - రైతు రుణ‌మాఫీ - నిజాం షుగ‌ర్స్ ప్యాక్ట‌రీ మూసివేత త‌దిత‌ర అంశాల‌పై పోరాడేందుకు రంగంలోకి దిగారు. దీంతో ఉత్త‌మ్ సేన బ‌లప‌డింది. కొన్ని వారాలుగా ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై టీఆర్ ఎస్ మంత్రులెవ‌రూ స‌రిగా స్పందించ‌లేక‌పోతున్నారు. దీంతో ఉత్త‌మ్ త‌న స్పీడును మ‌రింత పెంచారు. దీనికితోడు జానారెడ్డి, స‌బితా రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క లాంటి సీనియ‌ర్లు కూడా దీపావ‌ళికి ముందే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల బాంబులు వేస్తుండ‌టంతో ఉత్త‌మ్ రెట్టించిన ఉత్సాహంతో మ‌రిన్ని ప్ర‌జా ఉద్య‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/