Begin typing your search above and press return to search.

ఎప్ప‌ట్లాగే..కూట‌మి ర‌చ్చ‌ను క‌వ‌ర్ చేసిన ఉత్త‌మ్‌

By:  Tupaki Desk   |   5 Nov 2018 4:14 PM GMT
ఎప్ప‌ట్లాగే..కూట‌మి ర‌చ్చ‌ను క‌వ‌ర్ చేసిన ఉత్త‌మ్‌
X
సీట్ల పంపకానికి ముందే విపక్ష కూటమి బీటలు వారుతున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ నాన్చివేత ధోరణిపై భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో లాభమేమీ లేదని అంత‌ర్గ‌త సంభాష‌న‌ల్లో వ్య‌క్తం చేస్తూ సీట్ల పంపకం చాలా ఆలస్యమైందని సీపీఐ - టీజేఎస్‌ లు మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే విలువైన అవకాశం కోల్పోయామని సీపీఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో పోటీ చేయదలుచుకున్న 9 స్థానాలను సీపీఐ ప్రకటించింది. డిమాండ్ చేసిన స్థానాలు ఇవ్వకుంటే కూటమికి గుడ్‌ బై చెప్పే యోచనలో సీపీఐ ఉంది. అడిగినన్ని స్థానాలు కేటాయించకపోతే ప్లాన్ బీ ప్రకారం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ...అవి ఫ‌లించ‌లేద‌ని స‌మాచారం.

ఈ ప‌రిణామం రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టించిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మహాకూటమి నేతలతో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి - పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా నలుగురు ఏఐసీసీ సెక్రటరీలు - పార్టీ సీనియ‌ర్ నేతలు. మల్లు భట్టి విక్రమార్క - మధు యాస్కీ గౌడ్ స‌మావేశం అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఈ స‌మావేశానికి తెలంగాణ‌ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్ రమణ సమావేశానికి హాజరు కాలేదు. త‌మ సీట్ల విషయంలో కొంత స్పష్టత ఉన్న కారణంగా హాజరుకాబోమ‌ని ఎల్ రమణ వెల్ల‌డించారు. చర్చలకు త‌మకు ఇంకా ఆహ్వానం అందలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి వెల్ల‌డించారు. పార్క్ హయత్ హోటల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతలతో భేటీ అయిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మ‌ధ్య‌లోనే వాకౌట్ చేసిన‌ట్లు ప‌లు మీడియాల్లో ప్ర‌చారం జ‌రిగింది.

ఈ వార్త‌లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జ‌రిగిన నేప‌థ్యంలో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి స్పందించారు. పార్క్ హయత్ వ‌ద్ద ఉత్తమ్‌ కుమార్ రెడ్డి స్పందిస్తూ మహాకూటమి నుండి ఏ పార్టీ బయటకు వెళ్ళదన్నారు. కూటమిగానే ఎన్నికలకు వెళతామ‌ని తెలిపారు. కోదండరాం మధ్యలో వెళ్లిపోయారన్నది నిజం కాదని - కోదండరాంతో చర్చలు ఫలప్రదంగా ముగిశాయ‌ని అసంతృప్తిని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. వాళ్ళ పార్టీ నేతలతో చర్చించి చెబుతానని కోదండరాం పేర్కొంటూ చర్చలు ముగిసిన తర్వాతనే వెళ్లిపోయారని వివ‌రించారు.

జనసమితి - సీపీఐ సీట్లపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమ‌ని, సీట్లపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు.సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట‌రెడ్డితో కూడా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశం కోసం మంగ‌ళ‌వారం ఢిల్లీకి వెళుతున్నానని ఆయ‌న వివ‌రించారు.