ఉత్తమ్ వల్లే...కూటమి చీలిపోనుందా?

Fri Nov 02 2018 10:26:18 GMT+0530 (IST)

తెలంగాణ మహాకూటమిలో చీలిక రానుందా? ఈ చీలికకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణం అవుతున్నారా? ఉత్తమ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్న కూటమి నేతలు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయనున్నారా? ఢిల్లీ వేదికగా జరిగే కీలక చర్చల్లో కూటమి చర్చలు కొలిక్కి రావడంతో పాటుగా ఉత్తమ్ పై ఫిర్యాదులు చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీల మద్య సీట్ల అవగాహన కుదిరిందని - టీజేఎస్ - సీపీఐ పార్టీలతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని ప్రకటించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతటితో ఆగకుండా కాంగ్రెస్ 95 సీట్లలోనూ - టీడీపీ 14 సీట్లలోనూ పోటీ చేస్తాయని ప్రకటించడం ఈ చర్చను తెరమీదకు తెచ్చింది.ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ 95 సీట్లలోనూ - టీడీపీ 14 సీట్లలోనూ పోటీ చేస్తాయని ప్రకటించారు. మిత్రధర్మం పాటించకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీట్ల సంఖ్యను ఏకపక్షంగా ప్రకటించటాన్ని రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ - టీడీపీ కలిసి 109 సీట్లకు పోటీచేస్తే ఇక మిగిలే పది స్థానాలకు తాము పరిమితం కావాలనే సంకేతాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపటం టీజేఎస్ - సీపీఐ పార్టీల్లో కలకలం రేపింది. కేవలం నాలుగైదు సీట్లకే రెండు పార్టీలు పరిమితం కావాలని కాంగ్రెస్ శాసిస్తున్నట్టు కనిపిస్తున్నదని సీపీఐ నేతలు అంటున్నారు. తాము కోరుతున్న 6 సీట్లలో ఒక్కటి తగ్గినా అంగీకరించేది లేదని సీపీఐ నేతలు కాంగ్రెస్ నేతలకు తేల్చి చెప్పారు. సీట్ల కేటాయింపు వ్యవహారం రాష్ట్ర స్థాయిలో కొలిక్కి రాకపోవటంతో నేరుగా ఏఐసీసీ పెద్దలతో సీపీఐ జాతీయ నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి - కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ బుధవారం నుంచే అహ్మద్ పటేల్ - గులాం నబీ ఆజాద్ తదితర నాయకులను కలిసి సీట్ల వ్యవహారంపై చర్చించినట్టు తెలిసింది.

మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అవుతుండటంతో సీట్ల చర్చ ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీని కలిసిన సందర్భంగా కోదండరాం మహాకూటమి వ్యూహాలు - ప్రచారం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటులో నెలకొన్న సమస్యలను ప్రస్తావించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ కొలిక్కివచ్చిన నేపథ్యంలో ఉమ్మడిగా ప్రచారం చేసే అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.