Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు ముఖ్యుల మ‌ధ్య చీలిక నిజ‌మే!

By:  Tupaki Desk   |   31 Aug 2017 6:48 AM GMT
ఆ ఇద్ద‌రు ముఖ్యుల మ‌ధ్య చీలిక నిజ‌మే!
X
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న విబేధాలు తేట‌తెల్లం అయ్యాయి. పార్టీని జోడెద్దుల్లా న‌డిపించాల్సిన నాయ‌కుల మ‌ధ్య చీలిక‌లు మీడియా సాక్షిగా బ‌య‌ట‌ప‌డ్డాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కెప్టెన్‌ గా అందరినీ సమన్వయం చేయాల్సిన టీపీసీసీ అధ్యక్షుడు నల్లమాద‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు జారారు. ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి ఆయ‌నెవ‌రో అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇదేదో రహస్యంగానో....లేదా తనకు కావాల్సిన వారి సమక్షంలో జరిగిన సంఘటన కాదు. ఏకంగా మీడియా సమావేశంలోనే భట్టి విక్రమార్కను ఆయనెవరో అన్నట్లు మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 88తో పాటు సీఎం కేసీఆర్‌ కు గ్లోబల్ అవార్డుపై ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి మాట్లాడారు. సీఎంకు గ్లోబల్ అవార్డు కాదు బోగస్ అవార్డు వచ్చిందని ఆరోపించారు. జీవోకు సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. జీవో 39 ను రద్దుచేయాలని కోరుతున్నారా ? మీఅభిప్రాయం చెప్పండి? మీవర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్ర‌మార్క జీవోను ర‌ద్దుచేయాల‌ని కోర‌డంపై మీరేమంటారు అని విలేక‌రులు ప్ర‌శ్నించగా ఉత్తమ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ``ఆయనెవరో అడిగితే నన్ను జవాబు చెప్ప మంటారా ? అట్లడగరాదు. ఇప్పడు చెబుతున్నా జీవో నిలుపుద‌ల చేయాల‌నేది పార్టీ అభిప్రాయం`` అని వ్యాఖ్యానించారు.

నాయకులను సమన్వయం చేయాల్సిన కెప్టెన్ ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలపై గరం కావడంతో వేదికపై ఉన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి - ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్.ఎమ్మెల్యే ఎస్ ఎ సంపత్ కుమార్ ఖంగుతిన్నారు. విలేక‌రుల స‌మావేశం తర్వాత భట్టిపై ఎందుకు మీ అధ్య‌క్షుడు అంతగా ఫైర్ అయ్యారని అడగ్గా..ఏమో బాస్ అంటూ విలేఖరులతో మాట్లాడేందుకు నిరాకరించారు. మొత్తంమీద ఇంతవరకు ఉత్తమ్ భట్టి మధ్య విబేధాలు ఉన్నాయని చెప్పకోవడమే గాని ఇద్దరు బాహాటంగా ఎప్పడూ బయటపడలేదు. పార్టీ కార్యక్రమాలు - సమావేశాల్లో తమ మధ్య విబేధాలు అస‌లు లేవు, క‌లిసే ఉన్నామనే విధంగా వ్యవహరించేవారు. కానీ, వారి మధ్య నివరుగప్పిన నిప్పలా ఉన్న విబేధాలు ఉన్నట్లు ఉత్తమ్ కామెంట్ తో బయట పడ్డాయని... ఇవి పార్టీలో చర్చనీయాంశమయ్యాయని అంటున్నారు.