Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌ కు వ‌రంగ‌ల్ అంత షాకిచ్చిందా?

By:  Tupaki Desk   |   27 Nov 2015 7:11 AM GMT
ఉత్త‌మ్‌ కు వ‌రంగ‌ల్ అంత షాకిచ్చిందా?
X
తెలంగాణ‌ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని క‌దిలించాలంటే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు సైతం జంకుతున్నారు. వరంగ‌ల్ ఉప ఎన్నిక‌ల విష‌యాన్ని వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌గా తీసుకొని.. తీవ్రంగా శ్ర‌మించిన‌ప్ప‌టికీ.. దారుణ‌మైన ఫ‌లితం రావ‌టం.. పార్టీ అభ్య‌ర్థికి డిపాజిట్ కూడా ద‌క్క‌క‌పోవ‌టంపై ఉత్త‌మ్ తీవ్రంగా వేద‌న చెందుతున్నార‌ట‌.

వ‌రంగల్ ఉప ఎన్నిక ఫ‌లితాలు విడుద‌లై దాదాపు నాలుగు రోజులు అవుతున్నా ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌టానికి.. మీడియాతో మాట్లాడ‌టానికి సుతారం ఇష్ట‌ప‌డ‌టం లేద‌ట‌. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ప్ర‌క్రియ మొద‌లై నాటి నుంచి చాలానే ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగ‌మిస్తూ కిందామీదా ప‌డిన‌ప్ప‌టికీ అంతిమ ఫ‌లితం దారుణంగా ఉండ‌టం ఆయ‌న తెగ ఫీలైపోతున్నార‌ట‌.

మాజీ ఎంపీ రాజ‌య్య ఎపిసోడ్ ఇచ్చిన షాక్ ను అధిగ‌మించి.. పార్టీ అభ్య‌ర్థిని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మార్చ‌టం ద‌గ్గ‌ర నుంచి ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌న స‌త్తాను చాటేందుకు విప‌రీతంగా శ్ర‌మించిన‌ట్లు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం త‌న సొంత డ‌బ్బును కూడా ఉత్త‌మ్ ఖ‌ర్చు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ఠ‌గా తీసుకొని ఢిల్లీ నుంచి జాతీయ‌స్థాయి నాయ‌కుల్ని వ‌రంగ‌ల్ ప్ర‌చారానికి తీసుకొచ్చారు.

దిగ్విజ‌య్ సింగ్‌.. మీరాకుమార్‌.. గులాం న‌బీ అజాద్‌.. స‌చిన్ పైలెట్ లాంటి వారిని తీసుకొచ్చి ప్ర‌చార చేసిన‌ప్ప‌టికీ.. అనుకున్న స్థాయిలో ఫ‌లితం రాక‌పోవ‌టంపై వేద‌న చెందుతున్న ఉత్త‌మ్‌.. ఘోర ప‌రాజ‌యాన్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత మీడియా ముందుకు రాని ఆయ‌న‌.. ప‌రాజ‌యానికి బాధ్య‌త వ‌హిస్తూ పార్టీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌టానికి సైతం తాను సిద్ధ‌మేనంటూ సంకేతాలు పంపిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌రాజ‌యాల బాట‌లో పార్టీ ప‌య‌నిస్తున్న‌ప్పుడు.. మ‌రింత శ్ర‌మించి గెలుపు ప‌ట్టాల మీద పార్టీ ప‌య‌నించేలా చేయాలే కానీ.. అస్త్ర‌స‌న్యాసం చేయ‌టం ఏమిటో..?