Begin typing your search above and press return to search.

12న కాంగ్రెస్ ప్ర‌మాణ స్వీకారం !

By:  Tupaki Desk   |   23 Oct 2018 5:33 PM GMT
12న కాంగ్రెస్ ప్ర‌మాణ స్వీకారం !
X
రాజ‌కీయ పార్టీల కాన్ఫిడెన్స్ భ‌లే ముచ్చ‌ట‌గా ఉంటుంది. అస‌లు ఎన్నిక‌ల‌పుడు పార్టీ నేత‌ల మాట‌ల‌ను చూస్తే మ‌నం ఇంకా ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్‌ మెంట్ పుస్త‌కాలు చ‌దివి నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉందా అనిపిస్తుంది. ఒక ల‌క్ష్యం పెట్టుకుని ప‌నిచేసేట‌పుడు మ‌న మీద మ‌న‌కు ఎంత న‌మ్మ‌కం ఉండాలి? దానికి ఎలాంటి ప్ర‌య‌త్నం ఉండాలి? వ‌ంటి వాటికి ఎన్నిక‌ల‌పుడు రాజ‌కీయ పార్టీల ప‌నితీరే స‌రైన ఎగ్జాంపుల్‌.

మొన్న అభ్య‌ర్థుల‌తో మీటింగ్ పెట్టిన కేసీఆర్ 110 సీట్లు మ‌న‌వే అని కాన్ఫిడెంట్‌ గా చెప్పారు. ఈరోజు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాస్కోండి... డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికల పోలింగ్ - 11న కౌంటింగ్ - 12న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేయబోతోంది అని అంత‌కుమించిన న‌మ్మ‌కంతో చెబుతున్నారు. ఎవ‌రో ఒకరే గెలుస్తారు. కానీ ఎవ‌రు మాట‌లు విన్నా వీళ్లే గెలుస్తారేమో అన్న‌ట్టుంది రాజ‌కీయ పార్టీల‌ను చూసిన‌పుడు.

ఈరోజు ఉత్త‌మ్‌... టీఆర్ ఎస్‌ పై తీవ్రంగా ఆరోప‌ణ‌లు చేశారు. కేసీఆర్ దోచిన దాంతో పోల్చితే ఆంధ్రా పాల‌కులు దోచింది చాలా త‌క్కువ‌న్నారు. విద్యార్థులు లేక‌పోతే తెలంగాణ ఉద్య‌మ‌మే లేదు. వారిని కేసీఆర్ - కేటీఆర్ మోసం చేశారు. దగా చేశారు. అన్నీ అబద్ధాలు చెప్పారు. తండ్రీకొడుకులు అబద్ధాల కోర్లు, నోరు తెరిస్తే అబద్ధాలే అని ఉత్త‌మ్ విరుచుకుప‌డ్డారు.

కాంగ్రెస్ ప్రామిస్ చేస్తోంది... అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మొదటి సంవత్సరంలో నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని ఉత్త‌మ్ ప్ర‌క‌టించారు. వీటిలో 20 వేల ఉద్యోగాలకు మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అన్నారు. స్వయం ఉపాధి, ప్రైవేటు రంగం ద్వారా మరో లక్ష ఉద్యోగ అవకాశాలు క‌ల్పిస్తామ‌ని ఆయ‌న ప్రామిస్ చేశారు.