Begin typing your search above and press return to search.

ఈసారి ఆంధ్రోళ్ల ఓటు కాంగ్రెస్‌ కేన‌ట‌!

By:  Tupaki Desk   |   11 Aug 2018 5:05 AM GMT
ఈసారి ఆంధ్రోళ్ల ఓటు కాంగ్రెస్‌ కేన‌ట‌!
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఇచ్చిన ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ వాడిన భాష‌ను తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు మ‌ర్చిపోలేద‌ని.. వారంతా స‌మ‌యం కోసం వేచి ఉన్నార‌ని చెప్పారు.

వారంతా కాంగ్రెస్ త‌ర‌ఫు ఉన్న‌ట్లు చెప్పిన ఉత్త‌మ్‌.. ఈసారి ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఆంధ్రుల ఓట్లు త‌మ పార్టీకేన‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో నివ‌సిస్తున్న ఆంధ్రా..రాయ‌ల‌సీమ‌కు చెందిన వారు ఎక్కువ సంఖ్య‌లో ఉండే చోట్ల‌.. వారి సంఖ్య‌కు అనుగుణంగా రాజ‌కీయ‌ప్రాధాన్యం క‌ల్పించ‌బోతున్నామ‌న్నారు.

పార్టీలోనూ.. ప్ర‌భుత్వంలోనూ.. ఎంపీ.. ఎమ్మెల్యేల టికెట్ల‌లోనూ ప్రాధాన్య‌మిస్తామ‌ని ఉత్త‌మ్ చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో తెలంగాణ ఆంధ్రులు టీఆర్ ఎస్ వైపు నిలిచార‌నటంలో నిజం లేద‌న్నారు. ఎన్నిక‌ల వేళ‌.. ఇక్క‌డ స్థిర‌ప‌డిన ఆంధ్రుల‌ను టీఆర్ ఎస్ పెద్ద‌లు బెదిరింపుల‌కు గురి చేశార‌న్నారు.

విభ‌జ‌న ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్రా.. రాయ‌ల‌సీమ వాసుల ప‌ట్ల కేసీఆర్ వాడిన భాష‌ను వారింకా మ‌ర్చిపోలేద‌న్న ఉత్త‌మ్‌.. స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నార‌ని.. ఇప్పుడు ఆ స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. రెండు రాష్ట్రాల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని కాంగ్రెస్ కోరుకున్న‌ట్లుగా చెప్పారు. రాష్ట్రంలోజ‌రిగే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ 75 సీట్ల‌కు త‌గ్గ‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని.. ఒంట‌రిగానైనా.. పొత్తుల‌తోనైనా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌టం త‌థ్య‌మ‌ని ఉత్త‌మ్ జోస్యం చెప్పారు.

ఈ నెల 13.. 14 తేదీల్లో హైద‌రాబాద్‌ లో జ‌రిగే రాహుల్ ప‌ర్య‌ట‌న పార్టీలో కొత్త ఉత్సాహాన్ని.. ఊపును తెస్తుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. పైలెట్ గా యుద్ధ విమానం న‌డ‌ప‌టం కంటే.. పార్టీని న‌డ‌ప‌ట‌మే క‌ష్ట‌సాధ్య‌మ‌న్న ఉత్త‌మ్‌.. తెలంగాణ‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న అనంత‌రం ప‌రిస్థితుల్లో మార్పులు రావ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయాన్ని బ‌లంగా వినిపించారు.

టీఆర్ ఎస్ లోని కేసీఆర్ కుటుంబ స‌భ్యులు మిన‌హా.. టీఆర్ ఎస్ నేత‌లంతా కాంగ్రెస్ పార్టీతో ట‌చ్ లో ఉన్నారంటూ ఉత్త‌మ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. కేసీఆర్ కుటుంబం మిన‌హా టీఆర్ ఎస్ లోని అనేకమంది ముఖ్యులు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని.. ఆ పార్టీలో ఎవ‌రికీ క‌నీస గౌర‌వం లేద‌ని ప‌లువురు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు త‌న‌తో స్వ‌యంగా చెప్పిన‌ట్లుగా ఉత్త‌మ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. మ‌రి.. దీనిపై కేసీఆర్ ఫ్యామిలీ నేత‌లు ఏ రీతిలో రియాక్ట్ అవుతార‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.