Begin typing your search above and press return to search.

తుమ్మల గొంతులో వెలక్కాయలా ఉత్తమ్ సవాల్

By:  Tupaki Desk   |   4 May 2016 4:23 AM GMT
తుమ్మల గొంతులో వెలక్కాయలా ఉత్తమ్ సవాల్
X
కొందరి అదృష్టం ఓ రేంజ్లో ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రోడ్ల మీదకు వచ్చి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినకున్నా.. అరెస్ట్ అయి జైల్లో గడపకున్నా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత గౌరవం పొందే నేతల్లో తుమ్మల నాగేశ్వరరావు ఒకరు. టీఆర్ ఎస్ పార్టీలో మరెవరికి సాధ్యం కాని రీతిలో.. స్వయంగా కేసీఆరే తుమ్మల్ని ‘కారు’ ఎక్కించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

మాటలతో కన్వీన్స్ చేసి తుమ్మలను పార్టీలోకి తీసుకొచ్చిన కేసీఆర్.. ఆయనకు సముచిత స్థానం ఇవ్వటమే కాదు.. మంత్రి పదవిని కట్టబెట్టారు. ఎమ్మెల్సీ కోటా కింద తుమ్మలను ఎంపిక చేసి.. ఎన్నికల బరిలో దిగకుండా చేశారు. అయితే.. అనుకోని విధంగా పాలేరు ఉప ఎన్నిక తెర మీదకు రావటం.. ఖమ్మం జిల్లాలో గులాబీ జెండాను బలంగా దింపాలన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్.. తుమ్మలను బరిలోకి దింపారు.

మంత్రిగా ఉంటూ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న తుమ్మల.. గెలుపే ధ్యేయంగా దూసుకెళ్తున్నారు. పాలేరు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. మాటలతో తుమ్మల స్పీడ్ కు బ్రేకులు వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మైండ్ గేమ్ మొదలెట్టిన కాంగ్రెస్ నేతలు.. ఆయనకు దమ్ముంటే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారు. చూస్తూ.. చూస్తూ తుమ్మల ఎటూ తన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం లేదు. తాము సవాలు చేసినా.. స్పందించలేదన్న క్రెడిట్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దక్కనుంది.

తాము ఉత్తినే సవాలు విసరటం లేదని.. గతంలో తాము అనుసరించిన సంప్రదాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గుర్తు చేస్తున్నారు. నాడు కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో నాడు మంత్రిగా వ్యవహరిస్తున్న జీవన్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మరీ ఎన్నికల బరిలో దిగిన విషయాన్ని మర్చిపోకూడదని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. అప్పుడెప్పుడో ఎవరో ఏదో చేశారని.. ఇప్పుడు తుమ్మల చేయాలనటం ధర్మమేనా ఉత్తమ్. నిజానికి సంప్రదాయాన్నే అనుసరించి ఉంటే పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవమే అయ్యేది కదా..?