Begin typing your search above and press return to search.

మేం తిడితే నిండా క‌ప్పుకొని పండుకోవాలి

By:  Tupaki Desk   |   28 July 2017 4:39 AM GMT
మేం తిడితే నిండా క‌ప్పుకొని పండుకోవాలి
X
తెలంగాణ అధికార‌.. విప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. త‌న మీద ఆరోప‌ణ‌లు చేసిన కాంగ్రెస్ నేత‌ల మీద మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టం తెలిసిందే. ఎప్పుడూ లేని విధంగా తిట్టిన తిట్టు తిట్ట‌ని రీతిలో తిట్ల దండ‌కాన్ని అందుకున్న కేటీఆర్ తీరు చూసిన ప‌లువురు షాక్ తిన్నారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌లు మామూలే. ఇక‌.. ఆరోప‌ణ‌ల గురించి చెప్పాల్సి అవ‌స‌ర‌మే లేదు.

తాము విప‌క్షంలో ఉన్న‌ప్పుడు నాటి అధికార కాంగ్రెస్ మీద టీఆర్ ఎస్ నేత‌లు ఎన్నేసి ఆరోప‌ణ‌లు చేశారో తెలిసిందే. అయితే.. త‌మ‌ను ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌కూడ‌ద‌న్న‌ట్లుగా కేటీఆర్ మాట‌లు ఉన్నాయ‌ని.. ఇది స‌రైన వైఖ‌రి కాద‌న్న మాట వినిపిస్తోంది. త‌మ‌ను ఎవ‌రూ వేలెత్తి చూపించ‌కూడ‌ద‌న్న‌ట్లుగా కేటీఆర్ ఆయ‌న తండ్రి కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న అభిప్రాయం బ‌లంగా వ్య‌క్త‌మ‌వుతోంది.

త‌మ‌ను మాట‌ల‌తో ఉతికి ఆరేసిన మంత్రి కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్లు జానారెడ్డి.. ఉత్త‌మ్ లాంటి వారు హుందాగా రియాక్ట్ కాగా.. వీహెచ్.. లాంటి నేత‌లు మాత్రం మాట‌కు మాట అన్న రీతిలో విరుచుకుప‌డ్డారు. తాజాగా వీహెచ్ మాట్లాడుతూ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

చిన్న వ‌యసులోనే పెద్ద మాట‌లు మాట్లాడుతుండ‌ని.. తాము తిట్ట‌టం మొద‌లు పెడితే చార్మినార్ ద‌గ్గ‌ర రెండు రోజుల దాకా చెవులు మూసుకొని నిండా క‌ప్పుకొని పండుకోవాలంటూ మండిప‌డ్డారు. నేరెళ్ల ఘ‌ట‌న‌కు కార‌కుడైన కేటీఆర్ పై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి స‌స్పెండ్ చేయాలంటూ వీహెచ్ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. నేరెళ్ల‌లో ద‌ళితుల‌పై దౌర్జ‌న్య‌కాండను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఇసుక మాఫియా కార‌ణంగా రోడ్లు దెబ్బ తింటున్నాయ‌ని ఆగ్ర‌హించిన ద‌ళితుల‌పై పోలీసులు దౌర్జ‌న్యం చేశార‌న్నారు.

ఇసుక‌మాఫియా అధిప‌తి సీఎం స‌మీప బంధువేన‌ని ఉత్త‌మ్ ఆరోపించారు. గోల్డెన్ మైన్స్ మిన‌ర‌ల్స్ లిమిటెడ్ కంపెనీ ఉన్న ఆ బంధువు అక్ర‌మంగా ఇసుక‌ను ర‌వాణా చేస్తున్నార‌న్నారు. నేరెళ్ల‌లో అంత తీవ్ర‌స్థాయి ఘ‌ట‌న జ‌రిగినా సీఎం స్పందించ‌లేద‌ని.. అన్ని విష‌యాల‌పై ట్వీట్ చేసే ట్విట్ట‌ర్ బాబు సొంత జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న మీద ఎందుకు స్పందించ‌లేద‌ని కేటీఆర్‌ ను ప్ర‌శ్నించారు.

ద‌ళితులు.. బ‌ల‌హీన వ‌ర్గాలు పోరాడి తెలంగాణ‌ను తెచ్చుకున్న‌ది దాడుల‌కు గురి కావ‌టానికా? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. పోలీసుల చేతిలో చిత్ర‌హింస‌కు గురైన ద‌ళితులు రిమాండ్ లోకి తీసుకోవ‌టానికి జైల‌ర్ భ‌య‌ప‌డ్డార‌న్నారు. ఇలాంటి అంశాల్ని ప్ర‌శ్నిస్తే స‌మాధానం చెప్ప‌కుండా కేసీఆర్ కాంగ్రెస్ ను దూషిస్తార‌న్నారు. ఇది ప్ర‌జాస్వామ్య‌మా?

లేక మీ అయ్య జాగీరా? అంటూ మండిప‌డ్డారు. అధికారం ఉంది క‌దా అని విర్ర‌వీగొద్ద‌ని 2019లో కాంగ్రెస్‌ కు అధికారం రావ‌టం ఖాయ‌మ‌న్నారు.