Begin typing your search above and press return to search.

ఫోన్లో తిట్టినా నేర‌మేన‌ని తేల్చిన సుప్రీం

By:  Tupaki Desk   |   20 Nov 2017 4:33 AM GMT
ఫోన్లో తిట్టినా నేర‌మేన‌ని తేల్చిన సుప్రీం
X
అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసింది. ఎవ‌రైనా ఒక వ్య‌క్తి బ‌హిరంగంగా ఫోన్లో మాట్లాడుతున్న‌ప్పుడు ఎస్సీ.. ఎస్టీల‌ను కులం పేరుతో దూషించ‌టం నేర‌మేన‌ని తేల్చింది. దీనికి సంబంధించి దాఖ‌లైన ఒక కేసును కొట్టేసేందుకు స‌సేమిరా అంది. జ‌స్టిస్ చ‌ల‌మేశ్వ‌ర్‌.. జ‌స్టిస్ న‌జీర్ ల బెంచ్ ల ధ‌ర్మాస‌నం ఇందుకు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఎస్సీ ఎస్టీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 3(1)(ఎఫ్‌) ప్ర‌కారం నిమ్న వ‌ర్గాల వారిని బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఫోన్లో దూషించ‌టం కూడా నేర‌మేన‌ని చెప్పింది.

ఈ నేరానికి గ‌రిష్ఠంగా ఐదేళ్ల వ‌ర‌కు జైలు విధిస్తార‌ని స్ప‌ష్టం చేసింది. యూపీకి చెందిన ఒక వ్య‌క్తి నిమ్న వ‌ర్గాల‌కు చెందిన ఒక మ‌హిళ‌ను కులం పేరుతో దూషించాడు. మ‌హిళ‌ను కించ‌ప‌రుస్తూ మాట్లాడిన స‌మ‌యంలో స‌ద‌రు వ్య‌క్తి వేరే ఊళ్లో ఉన్నారు. నేరుగా కాకుండా ఫోన్లో మాట్లాడిన సంద‌ర్భంలో దూషించాడు.

సుప్రీంకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పుల్లో ఫోన్ సంభాష‌ణ బ‌హిరంగ ప్ర‌దేశం నిర్వ‌చ‌నం కింద‌కు రాద‌ని.. ఈ కార‌ణంగా కేసును కొట్టేయాల‌ని.. విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని కోరుతూ నిందితుడు కోర్టు గుమ్మం తొక్కాడు. ఈ కేసుకు సంబంధించి గ‌తంలోనే ఈ వ్య‌క్తి అల‌హాబాద్ హైకోర్టును ఆశ్ర‌యించాడు. అయితే.. పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ ఐఆర్ లో సేక‌రించిన ఆధారాల ఆధారంగా చూసిన‌ప్పుడు నిందితుడి మీద విచార‌ణ జ‌ర‌పాల్సిందేన‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

ఈ నేప‌థ్యంలో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాడు. నిందితుడు త‌ర‌ఫు లాయ‌ర్లు వాదిస్తూ.. ఫోన్ సంబాష‌ణ బ‌హిరంగ ప్ర‌దేశంలో మాట్లాడిన‌ట్లుగా ప‌రిగ‌ణించ‌కూడ‌ద‌ని.. కేసును కొట్టేయాల‌ని కోరారు. అయితే.. నిందితుడి త‌ర‌పు లాయ‌ర్లు చేసిన వాద‌న‌ల్ని సుప్రీంకోర్టు నో చెప్పింది. ఫోన్లో తిట్టినా బ‌హిరంగ ప్ర‌దేశంలో తిట్టిన‌ట్లేన‌న్న న్యాయ‌స్థానం.. నిందితుడు ఫోన్లో తిట్టిన‌ప్పుడు బ‌హిరంగ ప్ర‌దేశంలో లేడ‌ని నిరూపించుకోవాల‌ని పేర్కొంది.

ఏతావాతా ఈ కేసుతో అర్థ‌మ‌య్యేదేమంటే.. నిమ్న కులాల విష‌యంలో నేరుగా తిడితే న్యాయ‌ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయో.. అదే రీతిలో ఫోన్ సంభాష‌ణ విష‌యంలోనూ ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిదే. అయినా.. నోటిని ఎంత త‌క్కువ‌గా వాడితే తిప్ప‌లు అంత త‌క్కువ‌గా ఉంటాయి మ‌రి.