Begin typing your search above and press return to search.

అండ‌ర్‌ వేర్ల‌తో మ‌హిళ ఎంపీ ఆందోళ‌న‌..ఇది వినూత్నం

By:  Tupaki Desk   |   15 Nov 2018 1:48 AM GMT
అండ‌ర్‌ వేర్ల‌తో మ‌హిళ ఎంపీ ఆందోళ‌న‌..ఇది వినూత్నం
X
చ‌ట్ట‌స‌భ‌లు అంటే ఆందోళ‌న‌లు స‌హ‌జం. వివిధ ర‌కాలైన ప్ర‌జా ఆందోళ‌న‌లు స‌భ‌ల్లో చ‌ట్టం రూపం దాల్చుతుంటాయి. అయితే, వివిధ రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల స‌భ‌ల వేదిక‌గా ఆయా పార్టీలు ఆందోళ‌న చేస్తుంటాయి. అయితే, తాజాగా ఐర్లాండ్‌ లో ఓ వినూత్న‌మైన ఆందోళ‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. న్యాయ‌వ్య‌వ‌స్థ సిగ్గుప‌డేలా ఉండ‌ట‌మే కాకంఉడా మ‌హిళ‌ల భ‌ద్ర‌త గురించి ఆందోళ‌న చెందేలా ఈ ప‌రిణామం చోటుచేసుకుంది. ఐర్లాండ్‌ కు చెందిన  మ‌హిళా ఎంపీ రూత్‌ కాపింజ‌ర్‌.. త‌మ దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్ల‌మెంట్‌ లో ఆమె మ‌హిళ‌లు వేసుకునే అండ‌ర్‌ వేర్‌ ను  ప్ర‌ద‌ర్శిస్తూ త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శించారు.

ఈ సంచ‌న‌ల అంశానికి సంబంధించిన సంఘ‌టన‌ వివ‌రాల్లోకి వెళితే...ఐర్లాండ్‌ లోని కార్క్ అనే ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల ఓ 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి అత్యాచారానికి గురైంది. అయితే, ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ 27 ఏళ్ల వ్య‌క్తిని నిర్ధోషిగా ప్ర‌క‌టించారు. అయితే కోర్టులో ఆ కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో.. లాయ‌ర్ మాట్లాడుతూ ఆ యువ‌తి ఎలాంటి అండ‌ర్‌ వేర్ వేసుకుందో తెలుసా అని ప్ర‌శ్నించాడు. అమ్మాయి అప్పటికే మరొకరితో లైంగికంగా కలిసేందుకు సిద్ధపడిందని... ఇందుకు నిదర్శనం ఆమె వేసుకున్న అండర్ వేరే అని లాయరు తన వాదనలు వినిపించారు. ఆమె వేసుకున్న బట్టలను పరిగణలోకి తీసుకోవాలంటూ జడ్జిని కోరారు. దీంతో దేశ‌వ్యాప్తంగా న్యాయ‌వాదుల తీరుపై నిర‌స‌న వెల్లువెత్తుతున్న‌ది. ఈ ఎపిసోడ్‌ పైనే ఎంపీ రూత్ కాపింజ‌ర్ పార్ల‌మెంటులో ఘాటుగా స్పందించారు. ఓ వైపు అమ్మాయిపై అత్యాచారం జరిగిందన్న విషయం మరిచి అమ్మాయి ధరించిన దుస్తులపై దృష్టి పెట్టడమేంటంటూ ప్రశ్నించింది. అంటే మహిళలు తాము ధరించే దుస్తులను ఎంపిక చేసుకోవడం తప్పా అంటూ నిల‌దీశారు. విచార‌ణ స‌మ‌యంలో ఎలాంటి ప్ర‌శ్న‌లు వేయాలో కూడా తెలియ‌దా అంటూ మండిప‌డ్డారు. ఎప్పుడూ బాధితుల‌ను త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నారంటూ ఎంపీ కాపింజ‌ర్ ఆరోపించారు. బాధితుల‌ను వేధించ‌డం నిలిపేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్‌ లో ఆ ఎంపీ మాట్లాడుతూ.. బాధితురాలు వేసుకున్న అలాంటి అండ‌ర్‌ వేర్‌ నే ప్ర‌ద‌ర్శించారు. ఈ కేసుకు సంబంధించిన‌ తీర్పు కాపీ బ‌య‌ట‌కు రాగానే.. న్యాయ‌వాదులు వేస్తున్న‌ ప్ర‌శ్న‌ల స‌ర‌ళిపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న వెల్లువెత్తింది.

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘట‌నపై ఐరిష్ ప్రధాని లియో వరాద్కర్ స్పందించారు. ఇది ఒక్కరి సమస్య కాదని దేశవ్యాప్తంగా ఉన్న మహిళల సమస్యగా చూస్తున్నట్లు చెప్పారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు లైంగిక దాడులు - వేధింపులపై కఠిన చట్టాలు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  న్యాయపరంగా కూడా పలు చట్టాలను తీసుకువస్తామని ప్రధాని చెప్పారు. అత్యాచార కేసుల్లో విచారణ కూడా త్వరతగతిని పూర్తయి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.