Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సిద్ధాంతాల‌తో ఇంకో పార్టీ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   13 Aug 2017 6:05 AM GMT
ప‌వ‌న్ సిద్ధాంతాల‌తో ఇంకో పార్టీ వ‌చ్చేసింది
X
'గెలుపు ఓటములకు నేను భయపడను. 'పనిచెయ్యి.. కానీ ప్రతిఫలాన్ని ఆశించకు' అనేది నమ్ముతాను - పార్టీ నేత‌ల‌ను ఎంపిక ప‌రీక్ష ద్వారానే తీసుకుంటాను - నేను నాయకుడిని కాదు...జన సేవకుడిని...జన కార్మికుడిని...నాకు కులం అంట‌గ‌ట్ట‌వ‌ద్దు..నా పార్టీలో అన్ని కులాల వారికి అంద‌లం ఉంటుంది...ఈ అంశాలు ప్ర‌స్తావ‌న‌కు రాగానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌ను స్థాపించిన జ‌న‌సేన పార్టీ గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పింది - ఆచ‌ర‌ణ‌లో చూపుతోంది ఇదే. అచ్చూ ఇదే ఆలోచ‌న‌ల రీతిలో మ‌రో రాజ‌కీయ పార్టీ తెరంగేట్రం చేసింది. దాదాపుగా అవే సిద్ధాంతాలు....అవే ఆలోచ‌న దోర‌ణుల‌తో కన్నడ నటుడు ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.

కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు బెంగళూరులో విలేకరుల సమావేశంలో ప్రకటించిన ఉపేంద్ర ఈ సందర్భంగా ఆయన సందేశంతో కూడిన ఆడియో క్లిప్పును విడుదల చేశారు ప్రస్తుత రాజకీయ వ్యవస్థ - రాజకీయ నాయకులు - ప్రజల గురించి ఆయన మాట్లాడారు. ఎటువంటి 'పార్టీ ఫండ్‌ తీసుకోకుండా రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు తెలిపారు. 'ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత కూడా ఉండటం లేదు. ప్రజా ప్రతినిధులుగా ఉండాలనుకున్న వారికి కనీసం వాళ్ల నియోజకవర్గంలోని సమస్యల గురించి.. వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై తప్పకుండా అవగాహన ఉండాలి. పార్టీ టికెట్‌ ఇచ్చే సమయంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు రాతపరీక్ష పెట్టాలి. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికే పార్టీ టికెట్‌ ను ఇవ్వాలి' అని ఉపేంద్ర ఆడియో ద్వారా పేర్కొన్నారు. కావేరి జలాల వివాదం - రైతు ఆత్మహత్యలు తదితర సమస్యల గురించి ఈ ఆడియోలో ఉపేంద్ర ప్రస్తావించారు. 'సాకులు చెప్పి తప్పించుకునే రాజకీయ నాయకులు మాకు అవసరం లేదు. మా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే నాయకులు కావాలి. ఎటువంటి పార్టీ ఫండ్‌ తీసుకోకుండా రాజకీయ పార్టీని స్థాపిస్తాను. బ్యానర్లు పోస్టర్లు - ర్యాలీలు - ట్రాఫిక్‌ జామ్‌ లు లేకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాను. ఇది ఒక ప్రయోగం. కోట్ల రూపాయల ఖర్చుతో ప్రచార కార్యక్రమాలు చేయకుండా ప్రస్తుత రాజకీయ నాయకులు ఉండలేరు. కానీ అది నేను చేస్తాను. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇది చాలా కష్టమైన విషయమనేది నాకు తెలుసు. కానీ ప్రయత్నిస్తాను. ప్రజలు నాపై నమ్మకం ఉంచితే చాలు'.

'ఇతర పార్టీలు చేసినట్లు గొప్పగా నా రాజకీయ పార్టీని స్థాపించను. సామాజిక మాధ్యమాలు, టెలివిజన్‌ ఛానెల్స్‌, న్యూస్‌ పబ్లికేషన్స్‌ ద్వారానే నా పార్టీని ప్రచారం చేస్తానుః అని ఉపేంద్ర తెలిపారు. 'గెలుపు ఓటములకు నేను భయపడను. 'పనిచెయ్యి.. కానీ ప్రతిఫలాన్ని ఆశించకు' అనేది నమ్ముతానని ఆయన పేర్కొన్నారు. ఖాకీ రంగు చొక్కా ధరించి వచ్చిన ఉపేంద్రను ఉద్దేశించి ఆయన అభిమానులు రియల్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. తాను జన నాయకుడిని, జన సేవకుడిని కాదని.. జన కార్మికుడిననే అర్థం వచ్చేలా ఖాకీ చొక్కా వేసుకున్నానని ఉపేంద్ర తెలిపారు. తాను పూర్తిస్థాయి పారదర్శక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తున్నానని పేర్కొన్నారు. ఇదొక బహిరంగ వేదిక.. దీనికి డబ్బు - కులం లాంటివి అవసరం లేదు. ఎవరైనా చేరవచ్చు అని ఉపేంద్ర అన్నారు. పార్టీలో చేరే ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత పార్టీ పేరు - ఇతర వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. పేదలకు మంచి ఆరోగ్య సదుపాయాలు - విద్యావకాశాలు కల్పించవచ్చని, కానీ ప్రస్తుత పార్టీల నుంచి ఏమీ ఆశించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయని, కానీ వాటిలో చేరితే తాను అందులోని నాయకుల్లా మారిపోవాల్సి వస్తుందని చేరలేదని ఉపేంద్ర వివరించారు.