Begin typing your search above and press return to search.

`ఉత్త‌మ ప్ర‌జాకీయ పార్టీ`ని స్థాపించిన ఉపేంద్ర!

By:  Tupaki Desk   |   25 April 2018 12:27 PM GMT
`ఉత్త‌మ ప్ర‌జాకీయ పార్టీ`ని స్థాపించిన ఉపేంద్ర!
X

హీరో ఉపేంద్ర ....సినీ ఫ‌క్కీలో రాజ‌కీయ అరంగేట్రం చేయ‌డం....అంతే నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య పార్టీ నుంచి వైదొల‌గడం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. గ‌త అక్టోబ‌రులో ``కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ)``తో చేతులు క‌లిపిన ఉపేంద్ర‌...మార్చి 6న ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కేపీజేపీ వ్యవస్థాపకుడు మహేష్ గౌడతో వ‌చ్చిన విభేదాల కార‌ణంగానే ఉపేంద్ర ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మ పార్టీ సిద్ధాంతాలు ప్రకారం కాకుండా వేరే అభ్యర్థులను బరిలో దింపాలని మ‌హేష్ డిమాండ్ చేయ‌డంతో ఆ పార్టీ నుంచి ఉపేంద్ర త‌ప్పుకున్నారు. పార్టీ ఫండ్ వసూలు చెయ్య‌క‌పోతే ఓడిపోతామ‌ని మ‌హేష్ గౌడ్ త‌న‌ను బ‌ల‌వంతం చేయ‌డంతో విధిలేక బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ఉపేంద్ర బాహాటంగానే ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ఈ నేప‌థ్యంలో ఉపేంద్ర‌....తన సిద్దాంతాలకు అనుగుణంగా సొంత పార్టీ``ఉత్త‌మ ప్ర‌జాకీయ పార్టీ``ని స్థాపించేందుకు స‌న్నాహాలు మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే భార‌త ఎన్నిక‌ల సంఘంలో త‌న పార్టీని రిజిస్ట‌ర్ చేసేందుకు ఉపేంద్ర ఢిల్లీ వెళ్లారు.

త‌న సొంత‌పార్టీని స్థాపించి....వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగాల‌ని ఉపేంద్ర స‌న్నాహాలు మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఎటూ వ‌చ్చేనెల‌లో జ‌ర‌గ‌బోతోన్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉపేంద్ర పార్టీ పోటీ చేసే అవ‌కాశం లేదు. కాబ‌ట్టి వ‌చ్చే ఏడాది లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను ఉపేంద్ర టార్గెట్ చేసి పార్టీని స్థాపిస్తున్నారు. అయితే, తాను రాజ‌కీయాల్లో ఇప్పుడిపుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాన‌ని, మెల్ల‌గా అన్నీ నేర్చుకుంటాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. త‌న వెంట నిల‌బ‌డి ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు 100 మంది రెడీగా ఉన్నార‌ని ప్ర‌క‌టించారు. అయితే, అసెంబ్లీ ఎన్నిక‌ల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే....లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగి గెల‌వ‌డం ఉపేంద్ర కొత్త పార్టీకి అంత సులువు కాదు. కాంగ్రెస్ - బీజేపీ వంటి జాతీయ పార్టీల‌ను ఢీకొట్టడం రాజ‌కీయ ఓన‌మాలు నేర్చుకుంటోన్న ఉపేంద్ర‌కు అంత ఈజీకాదు.

బ‌హుశా....2023లో జ‌ర‌గ‌బోయే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ను ఉపేంద్ర టార్గెట్ చేసి ఉండ‌వచ్చు. ఈ ఐదేళ్ల కాలంలో....పార్టీ వ్య‌వ‌స్థాగ‌త నిర్మాణం...కార్య‌క‌ర్త‌ల స‌మీక‌ర‌ణ‌...పార్టీ విధివిధానాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం వంటి కార్య‌క్ర‌మాలపై ఉపేంద్ర ఫోక‌స్ చేయాల‌ని ప్లాన్ చేస్తూ ఉండ‌వ‌చ్చు. ఏది ఏమైనా...ఉపేంద్ర‌...భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు.