ఫ్యూచర్ ను డిసైడ్ చేయనున్న రానున్న 2 వారాలు!

Mon Mar 12 2018 13:18:07 GMT+0530 (IST)

నీరసంగా.. నిదానంగా సాగుతున్నట్లుగా ఉన్న దేశ.. రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేగం అందుకున్నాయి.  ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తే.. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే సార్వత్రిక ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైనట్లుగా చెప్పక తప్పదు.  ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ మొదలు రాష్ట్రాల వరకూ అన్ని నెమ్మదిగా ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోతున్నాయా? అన్న భావన కలగక మానదు.దీనికి తగ్గట్లే.. వివిధ పార్టీలు ఎవరికి వారు తమదైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక పరిణామాలు రానున్న రెండు వారాల్లో జరగనున్నాయని చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలంటే.. రానున్న రెండు వారాల్లో చోటు చేసుకునే పలు పరిణామాలు భవిష్యత్ రాజకీయాల్ని ప్రభావితం చేస్తాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే.. అంతటి కీలకమైన సమావేశాలు.. సభలు.. కార్యక్రమాలు జరగనున్నాయి.

రానున్న రెండు వారాలు ఎందుకంత కీలకమంటే..

+ ఆదివారం యూపీలో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు బీజేపీకి ఎంత బలం ఉన్నాయో చెప్పటమే కాదు.. ఆ ఫలితాలు ప్రభావం చూపున్నాయి.

+ కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ భారీ విందును ఇవ్వనున్నారు. ఈ నెల 13న (మంగళవారం) జరిగే విందునకు భారీ ప్రాధాన్యత ఉంది. భవిష్యత్ రాజకీయాలకు ఈ విందు పునాది కానుంది.

+ రాజ్యసభ ఎన్నికలు ఈ నెల మూడో వారంలో జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చోటు చేసుకునేది ఏమీ లేకున్నా.. కొత్తగా సభకు వచ్చే సభ్యుల కారణంగా ఫ్యూచర్ రాజకీయాలు ప్రభావితం కానున్నాయని చెప్పక తప్పదు.

+ ఏపీ రాజకీయాలకు వస్తే.. ఈ రెండు వారాలు చాలా కీలకమని చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోనియా విందుకు హాజరయ్యాక కీలక ప్రకటన ఏదైనా చేస్తారా? అసలు విందుకు వెళతారా?  వెళితే.. ఎన్డీయే పక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయి?  ప్రధాని మోడీ మొదలు బీజేపీ అధినాయకత్వం ఏలా రియాక్ట్ కానుందన్నది ఆసక్తికరంగా మారనుంది.

+ జనసేన పార్టీ ఆవిర్భావ సభను గుంటూరు సమీపంలో నిర్వహించననున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో పాటు.. తన బలాన్ని ఈ సభ ద్వారా ప్రదర్శించాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా చెప్పాలి. ఇప్పటికే ఈ సభకు హాజరు కావాలన్న సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సభ కోసం తయారు చేసిన పొట్టి వీడియోలు సినిమాటిక్ గా ఉండి.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

+ తెలంగాణ విషయానికి వెళితే.. జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించే విషయాన్ని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండు వారాల వ్యవధిలో కీలక ప్రకటనలు చేయటం ఖాయమని చెప్పక తప్పదు. అవన్నీ ఫ్యూచర్ రాజకీయాల్ని ప్రభావితం చేసేవే.