పెద్దోళ్ల ఓటు మిస్ అయితే అలానే ఉంటుంది మరి

Fri Apr 12 2019 14:37:16 GMT+0530 (IST)

పోలీస్.. ఎక్కడా?  కల్తీ జరిగిందని నిలదీసిన రైతును అదే కల్తీ మందు పోసి చంపేస్తే నో పోలీస్.. కాంట్రాక్టర్లను చంపేసి.. కాంట్రాక్ట్ పిలిచిన లేడీ ఆపీసర్ ను తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్.. ఇదేంటని ప్రశ్నిస్తే.. దారుణంగా చంపేస్తే నో.. పో..లీస్. కల్తీ పాలకు 60 ప్రాణాలు గాల్లో కలిసిపోతే.. అయ్యా ఇది పరిస్థితి అంటూ మొరపెట్టుకున్న తల్లిదండ్రుల్ని ఓదార్చటానికి నో పో..లీస్.. అంటూ మహా పవర్ ఫుల్ గా సాగిపోయే బాలయ్య డైలాగ్ గుర్తుకొస్తుంది ఈ వార్త చదివితే.  దానికి ముందుగా..



ఓటర్లు అంతా ఒక్కటే.  ఎవరూ తక్కువ కాదు. ఎవరు ఎక్కువ కాదు. ఇలాంటి మాటలు ఎవరైనా చెబితే అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే.. ఓటర్లతో సంపన్న.. పలుకుబడి ఉన్న ఓటర్లు వేరు.. సామాన్య ఓటర్లు వేరన్న విషయం ఎన్నికల సంఘం అధికారులు తాజాగా తేల్చేశారు. మూడు నెలల క్రితం లక్షలాది మంది ఓటర్లను డిలీట్ చేసి పారేస్తే.. సార్.. మా ఓటు లేదు.. ఇదెక్కడి పద్దతి అంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తే స్పందించిన అధికారి ఒక్కరు లేరు. చివరకు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్.. సింపుల్ గా సారీ చెప్పేశారు.

మరి.. తాజాగా జరిగిన తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త.. అపోలో ఆసుపత్రుల గ్రూప్ ఎగ్జిక్యుటివ్ వైస్ ఛైర్ పర్సన్.. ప్రముఖ హీరో రాంచరణ్ అత్తగారు శోభనా కామినేని ఓటు.. ఓటరు జాబితాలో గల్లంతైన వైనానికి అధికారులు స్పందించిన తీరు చూస్తే.. షాకింగ్ గా అనిపించటమే కాదు.. ఓటర్లు అందు ప్రముఖులైన ఓటర్లు వేరయా అన్న భావన కలగటం ఖాయం.

పది రోజుల ముందు జాబితాలో ఉన్న ఓటు పోలింగ్ రోజు నాటికి మిస్ అయిన వైనంపై శోభన కామినేని.. ఉపాసన కామినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారతీయ పౌరురాలిగా తనకిది దుర్దినమని.. ఇప్పుడు జాబితాలో నా ఓటు లేదంటే.. నేను భారతీయురాలిని కాదా? అంటూ ప్రశ్నించిన ఆమె.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

దీంతో ఇరుకున పడిన అధికారులు.. ఆమె ఓటు ఎందుకు మిస్ అయిందన్న విషయం మీద దర్యాప్తు నిర్వహించారు.  చివరకు ఆమె ఓటు గల్లంతు కావటానికి కారణమైన బూత్ లెవల్ అధికారి ఓం ప్రకాశ్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా జీహెచ్ ఎంసీ కమిషనర్ దానకిశోర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారంలో బాధ్యుడైన మరో డేటా ఎంట్రీ ఆపరేటర్ నరేందర్ రెడ్డిని వెనక్కి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు.

అసలు ఎందుకిలా జరిగిందన్న విషయానికి వస్తే.. విజయనగర్ కాలనీ పోలింగ్ బూత్ 49లో శోభనా కామినేనికి రెండు ఓట్లు చట్టవిరుద్ధంగా ఉన్నాయి. వీటిలో ఒక ఓటును తొలగించాల్సిందిగా సహాయ ఎన్నికల అధికారిక బీఎల్ ఓ ఓం ప్రకాశ్ ను ఆదేశించారు. ఓటు తొలగించే ప్రక్రియలో భాగంగా శోభనా కామినేనికి 7ఏ నోటీసులు ఇవ్వాలి. కానీ.. అలా చేయకుండా రెండు ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దీంతో.. వారిపై చర్యలు తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు.

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. ఈ విషయంలో మరో మాటకు అవకాశం లేదు. కాకపోతే.. అభ్యంతరమంతా ప్రముఖులైన వారు తమ ఓటు గల్లంతుపై గళం విప్పగానే.. ఆఘమేఘాల మీద స్పందించిన అధికార యంత్రాంగం.. సామాన్యుల విషయంలో ఎందుకలా వ్యవహరించదు?  ఇప్పుడు రియాక్ట్ అయిన విధంగానే స్పందిస్తే.. లక్షలాది సామాన్యుల ఓట్లు గల్లంతైన వైనంపై చర్యలు మరెంత భారీగా ఉండాలి?  అదేమీ చేయకుండా.. ప్రముఖులను ప్రసన్నం చేసుకునేలా చర్యలు తీసుకోవటం చూసినప్పుడు.. ఓటర్లంతా ఒక్కటే అన్న భావన కలుగుతుందంటారా?