Begin typing your search above and press return to search.

తెల్లవారుజామున కొలువు తీరిన సుప్రీం

By:  Tupaki Desk   |   30 July 2015 5:13 AM GMT
తెల్లవారుజామున కొలువు తీరిన సుప్రీం
X
దేశ చరిత్రలో మొదటిసారి సుప్రీంకోర్టు తెల్లవారుజామున కొలువు తీరింది. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు.. అసాధారణంగా గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం కొలువు తీరి.. యాకూబ్ మెమన్ ఉరిశిక్ష్ అమలును అపాలంటూ పెట్టుకున్న చివరి దరఖాస్తుపై విచారించింది.

చట్టంలోని నిబంధనల్ని తమకు అనుకూలంగా మార్చుకొని.. ఏదోలా యాకూబ్ మెమన్ ఉరిశిక్షను నిలిపివేసేందుకు అతని తరఫు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా వారు తెరపైకి తీసుకొచ్చిన వాదన ఏమిటంటే..జైలు మాన్యువల్ ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరించిన తర్వాత.. ఉరిశిక్ష అమలుకు మధ్య ఏడు రోజులు అంతరం ఉండాలంటూ ప్రశాంత్ భూషణ్ వాదించేందుకు సిద్ధమయ్యారు. మెమన్ తరఫు న్యాయవాదులు సైతం ఇదే అంశంపై తమ వాదనలు వినిపించాలని నిర్ణయించారు.

దీనిపై అప్పటికప్పుడు సుప్రీంకోర్టు కొలువుతీరాలని నిర్ణయించారు. మొదట తెల్లవారు జామున 2.30 గంటలకు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుందని భావించినా.. చివరకు మూడు గంటల సమయంలో ‘‘చివరి’ ప్రయత్నం‘‘పై విచారణ జరిగింది. దాదాపు గంటన్నర (ఉదయం నాలుగున్నర వరకూ) పాటు విచారణ జరిగింది.

ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు చోటు చేసుకున్నాయి. యాకూబ్ తరఫు న్యాయవాదుల వాదనల్ని ఏజీ ముకుల్ రోహత్గీ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. పదే పదే పిటీషన్లు దాఖలు చేయటం ఒక గేమ్ గా అభివర్ణించిన ఆయన.. ఈ కేసులో న్యాయప్రక్రియ పూర్తి అయ్యిందని.. తాజా పిటీషన్ యాకూబ్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న గేమ్ ప్లాన్ అని వాదించారు. ఇలాంటి చర్యల వల్ల న్యాయ ప్రక్రియకు అవరోదం కలుగుతుందని పేర్కొన్నారు.

పోటాపోటీగా సాగిన వాదనలు విన్న ముగ్గురు సభ్యులతో కూడి ధర్మాసనం (జస్టిస్ దీపక్ మిశ్రా.. జస్టిస్ ప్రఫుల్ చంద్రవంత్.. అమిత్ రాయ్) యాకూబ్ మెమన్ తరఫు న్యాయవాదులు పెట్టుకున్న దరఖాస్తును కొట్టివేశారు. తాజా పరిణామంతో ముందుగా నిర్ణయించినట్లే.. గురువారం ఉదయం ఏడు గంటలకు యాకూబ్ మెమన్ ఉరిశిక్షను అమలు చేయనున్నారు