Begin typing your search above and press return to search.

మోదీకి బాబు మిత్రుడా? శ‌త్రువా?: ఉండ‌వ‌ల్లి

By:  Tupaki Desk   |   21 March 2018 1:05 PM GMT
మోదీకి బాబు మిత్రుడా? శ‌త్రువా?: ఉండ‌వ‌ల్లి
X
ఏపీకి జీవ‌నాడి వంటి పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో త‌న‌కు అనుమానాలున్నాయ‌ని, ఆ ప్రాజెక్టు విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి స‌రిగా లేద‌ని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా రోజులుగా ఆరోపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ ప్రాజెక్టు విష‌యంలో టీడీపీ స‌ర్కార్ అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డుతోంద‌ని, ఆ ప్రాజెక్టులో అవినీతి తీవ్ర‌స్థాయిలో జ‌రుగుతోంద‌ని ఉండ‌వ‌ల్లి ప‌లుమార్లు మీడియాకు తెలిపారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి త‌న ద‌గ్గ‌ర పూర్తి స‌మాచారం ఉంద‌ని, ఆ ప్రాజెక్టుపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని టీడీపీ నేత‌ల‌కు స‌వాల్ కూడా విసిరారు. తాజాగా, మ‌రోసారి పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్రంతో ...చంద్ర‌బాబు లాలూచీ పడ్డార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై వాస్త‌వాలేమిటో త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఉండ‌వ‌ల్లి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

పోలవరం ప్రాజెక్టుపై గతంలో తాను ప‌లుమార్లు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశాన‌ని, అవ‌న్నీ నిజమయ్యాయని ఉండవల్లి అన్నారు. 2016 వరకు అస‌లు పోలవరం పనులు ప్రారంభం కాలేద‌ని, అందువ‌ల్లే రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయలేదని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి సంబంధించిన ప‌నుల‌ను రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్ట‌డం, డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. మోడీతో చంద్రబాబుకు మిత్రుత్వం ఉందో, శత్రుత్వం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. నవయుగ కంపెనీకి త‌క్కువ ధ‌ర‌కే పోల‌వ‌రం పనులు అప్పగించామ‌ని చంద్రబాబు అన్నార‌ని, కానీ, ఆ పనులను కేంద్ర మంత్రి గడ్కరీ అప్పగించారని ఆ సంస్థ చెబుతోంద‌ని అన్నారు. జనసేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేయ‌డం స‌బ‌బు కాద‌ని తెలిపారు. పవన్ ప్ర‌శ్న‌ల‌కు సమాధానం చెప్పకుండా విమ‌ర్శించ‌డం స‌రికాద‌న్నారు. పోల‌వ‌రంపై మొద‌టి నుంచి ప‌క్కాగా లెక్క‌ల‌తో స‌హా వివ‌రాలు వెల్ల‌డిస్తున్న ఉండ‌వ‌ల్లి తాజా వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.