Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మాట‌ల్లో ఉండ‌వ‌ల్లికి క‌నిపించిన త‌ప్పేంటి?

By:  Tupaki Desk   |   27 May 2019 8:08 AM GMT
జ‌గ‌న్ మాట‌ల్లో ఉండ‌వ‌ల్లికి క‌నిపించిన త‌ప్పేంటి?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల్ని తాను విభేదిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్. ఆదివారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌ధాని మోడీని క‌లిసిన అనంత‌రం ప్రెస్ మీట్ పెట్టిన సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. హోదా అంశంపై ప్ర‌ధానిని క‌లిసిన ప్ర‌తిసారీ గుర్తు చేస్తాన‌ని చెప్పటం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా రాజ‌మండ్రిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఉండ‌వ‌ల్లి. జ‌గ‌న్ మాట‌ల్ని తాను విభేదిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కేంద్ర‌ ప్ర‌భుత్వానికి మ‌న అవ‌స‌రం లేదు కాబ‌ట్టి.. ప్ర‌ధాన‌మంత్రిని క‌లిసిన ప్ర‌తిసారీ హోదా గురించి అడుగుతాన‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించం స‌రికాద‌న్నారు. ప్ర‌త్యేక హోదా అంశం చ‌ట్టంలో ఉంద‌ని.. దాన్ని అమ‌లు చేసి తీరాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు.

న‌రేంద్ర మోడీ అధికారంలోకి రావ‌టం త‌న‌కు ఇష్టం లేద‌న్న ఉండ‌వ‌ల్లి.. ఓట‌మిపై చంద్ర‌బాబు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ లు నిరాశ చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల‌న్న ఆస‌క్తి త‌న‌కులేద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి కావాలంటే ఏపీలో ఒక పోర్టును ఇవ్వ‌టంలో త‌ప్పు లేద‌న్న ఉండ‌వ‌ల్లి.. వైఎస్సార్ స్వ‌ప్న‌మైన వాన్ పిక్ క‌ల‌ను నెర‌వేర్చాల‌న్నారు.

జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌టానికి కార‌ణ‌మైన వాన్ పిక్ ను పూర్తి చేయాల‌ని.. విజ‌యం సాధించాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. మొత్తానికి జ‌గ‌న్ మాట్లాడిన మాట‌ల్లో త‌ప్పును వెతికిన ఉండ‌వ‌ల్లి మాట‌ల‌పై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.