Begin typing your search above and press return to search.

బాబు మైండ్ బ్లాంక్ అయ్యిందా

By:  Tupaki Desk   |   31 Aug 2015 5:51 PM GMT
బాబు మైండ్ బ్లాంక్ అయ్యిందా
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మైండ్‌ దెబ్బ‌తింద‌ని..ఆయ‌న జ్ఙాప‌క‌శ‌క్తి పూర్తిగా కోల్పోయిన‌ట్టు అనిపిస్తోందని రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్ విమ‌ర్శించారు. సోమ‌వారం రాజ‌మండ్రి పుష్క‌రాల రేవులో తొక్కిస‌లాట జ‌రిగిన ప్రాంతాన్ని సంద‌ర్శించిన ఆయ‌న అనంత‌రం విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. గోదావ‌రి పుష్క‌రాల ప్రారంభం రోజున తాను స్నానం చేసిన రేవు..పుష్క‌రాల తొక్కిస‌లాట ఘ‌ట‌న జ‌రిగిన రేవు ఒక్క‌టి కావ‌ని చంద్ర‌బాబు అంటున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయ‌ని అదే నిజ‌మైతే బాబుకు వృద్ధాప్యం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి దెబ్బ‌తింద‌ని..ఆయ‌నకు అల్జీమ‌ర్స్ వ్యాధి సోకిన‌ట్టు కూడా అనుమానాలు వ‌స్తున్నాయ‌న్నారు.

గ‌తంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు రొనాల్డ్‌ రీగ‌న్‌, మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కూడా ఈ వ్యాధితో బాధ‌ప‌డ్డార‌ని ..ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అదే వ్యాధికి గురైన‌ట్టు త‌న‌కు అనుమానం వ‌స్తోంద‌న్నారు. గ‌తంలో 2004లో కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా తొక్కిస‌లాట జ‌రిగి ఆరుగురు చ‌నిపోతే వైఎస్ వెంట‌నే కృష్ణా జిల్లా ఎస్పీ, క‌లెక్ట‌ర్‌ ను స‌స్పెండ్ చేసి సంఘ‌ట‌న‌కు బాధ్యులైన అధికారుల‌ను స‌స్పెండ్ చేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. నాడు వైఎస్ వెంటనే రాజీనామా చేయాల‌ని గగ్గోలు పెట్టిన టీడీపీ నాయ‌కులు ఇప్పుడు ఏమ‌ని స‌మాధానం చెపుతార‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. రాజ‌మండ్రిలో చంద్ర‌బాబు పుష్క‌ర‌స్నానం చేసిన వెంట‌నే అధికారులు నిర్ల‌క్ష్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌న్నారు.

తొక్కిస‌లాట జ‌రిగి 45 రోజులు అవుతున్నా నిజాలు వెల్ల‌డ‌వుతాయ‌న్న భ‌యంతో చంద్ర‌బాబు ఇంకా విచార‌ణ‌కు ఆదేశించ‌లేద‌న్నారు. అలాగే ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తికాకుండానే తాడిపూడి కాలువ నుంచి నాలుగు తూర‌లు పోల‌వ‌రం కాల్వ‌లోకి వేసి గోదావ‌రి-కృష్ణా న‌దులు అనుసంధానం చేసిన‌ట్టు చంద్ర‌బాబు గొప్ప‌లు చెప్పుకుంటున్నార‌ని...దానికంటే ఓ బాటిల్లో గోదావ‌రి నీళ్లు తీసుకెళ్లి కృష్ణాలో క‌లిపేసి న‌దుల అనుసంధానం చేశామ‌ని చెప్పుకుంటే ఇంకా బాగుండేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.