Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం డ‌బ్బులు తోడే ప్రాజెక్టు: ఉండ‌వ‌ల్లి

By:  Tupaki Desk   |   21 July 2017 11:18 AM GMT
పోల‌వ‌రం డ‌బ్బులు తోడే ప్రాజెక్టు: ఉండ‌వ‌ల్లి
X
టీడీపీ ప్ర‌భుత్వం పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ నిప్పులు చెరిగారు. అస‌లు ప్ర‌భుత్వానికి పోల‌వరం క‌ట్టే ఉద్దేశం ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్త‌యితే - ఎన్ని నీళ్లు వాడుకున్నా మ‌న‌ల్ని అడిగే వారుండ‌ర‌ని, అటువంటి ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో చేప‌ట్టిన‌న్ని ప్రాజెక్టులు ఏ సీఎం చేపట్ట‌లేద‌న్నారు. ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై వైఎస్ ఆర్ చాలా స్ట‌డీ చేశార‌న్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పోల‌వ‌రం ప్రాజెక్టును ప్ర‌భుత్వం పూర్తిగా ప‌క్క‌న పెట్టేసింద‌ని ఆయ‌న అన్నారు. పోల‌వరం ఎడ‌మ కాలువ మార్గంలో పురుషోత్త‌మ ప‌ట్నం పంపింగ్ స్కీమ్‌ - కుడి కాలువ మార్గంలో ప‌ట్టిసీమ పంపింగ్ స్కీమ్ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రమేంట‌న్నారు. దీన్నిబ‌ట్టి పోల‌వరంపై ప్రభుత్వానికి ఉన్న శ్ర‌ద్ధ ఏమిటో అర్థ‌మ‌వుతోంద‌ని ఎద్దేవా చేశారు. రూ.1700 కోట్ల వ్య‌యంతో పురుషోత్త‌మ ప‌ట్నం పంపింగ్ స్కీమ్ ను పోల‌వ‌రం ఎడ‌మ కాలువ ద‌గ్గ‌రే ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు.

పట్టిసీమ నీళ్లు తోడే ప్రాజెక్టుకాదని - డబ్బులు తోడే ప్రాజెక్టు అని ఆయ‌న చెప్పారు. రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న‌ప్ప‌టికీ స్పంద‌న లేదన్నారు. క‌నీసం ఆఫీస్‌ అటెండర్‌ నుంచి కూడా సమాధానం రాలేదని వాపోయారు. ప్రభుత్వ పనితీరును తెలుసుకోవ‌డానికి కాగ్‌ నివేదికే సరైనద‌న్నారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పనితీరును పీఏసీ ప్రశ్నిస్తుందన్నారు. ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’పై చర్చకు తాను సిద్ధమని సవాల్‌ విసిరారు.

ప్రాజెక్టుల్లో అవినీతిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు విజ‌య‌వాడ వ‌చ్చిన ఉండ‌వ‌ల్లిని పోలీసులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. పట్టిసీమ - పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతిని నిరూపిస్తానని ఉండవల్లి సవాల్ విసిరారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో బహిరంగ చర్చ కోసం ఉండ‌వ‌ల్లి మంగళవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు వచ్చారు. అక్క‌డ చ‌ర్చ‌కు అనుమ‌తి లేదంటూ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టిన సంగ‌తి తెలిసిందే.