Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి స‌మ‌క్షంలో బాబు, కేసీఆర్ రాజీ ..!

By:  Tupaki Desk   |   28 Aug 2016 7:06 AM GMT
కేంద్ర మంత్రి స‌మ‌క్షంలో బాబు, కేసీఆర్ రాజీ ..!
X
రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు తెర‌మీద‌కి వ‌చ్చాయి. ఉమ్మ‌డి ఆస్తులు - అప్పులు - ఉద్యోగుల విభ‌జ‌న‌ - కార్యాల‌యాల పంపకం - ప‌దో షెడ్యూలు - నీరు వంటివాటి విష‌యంలో విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం పంప‌కాలు జ‌ర‌గాల్సి ఉంది. అయితే, ఇరు రాష్ట్రాల ఈగోల ప్రాబ్లం కార‌ణంగా జ‌లాలు - స‌హా కొన్ని మౌలిక స‌మ‌స్య‌ల విష‌యంలో ఇరు రాష్ట్రాలూ ఎవ‌రి పంతం అవే పాటిస్తున్నాయి. ఏ ఒక్క‌టి బెట్టు వీడ‌డం లేదు. దీనిలో ప్ర‌ధానంగా జ‌ల వన‌రుల శాఖ‌దే స‌మ‌స్య‌గా మారింది. తెలంగాణ చేప‌ట్టిన ఎత్తి పోత‌ల ప‌థ‌కాల‌పై ఏపీ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌గా, ఎగువ రాష్ట్రంగా మాకు ఆ హ‌క్కు ఉందంటూ తెలంగాణ ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగింది. అదేవిధంగా నాగార్జున సాగ‌ర్ విష‌యంలోనూ ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తో భ‌గ్గుమంటోంది.

ఈ నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాలూ త‌మ స‌మ‌స్య‌ను కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ వ‌ద్ద ప్ర‌స్తావించారు. దీంతో గ‌తంలోనే కేంద్ర జ‌ల‌వ‌న‌రుల మంత్రి ఉమా భార‌తి ఇరు రాష్ట్రాల జ‌ల వ‌న‌రుల మంత్రులు ఏపీకి చెందిన దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు - తెలంగాణ‌కు చెందిన టీ హ‌రీశ్‌ రావుల‌ను ఢిల్లీకి పిలిపించి పెద్ద పంచాయ‌తీ పెట్టింది. అయితే, అప్పుడు కూడా ఈ ఇద్ద‌రూ త‌మ త‌మ శైలిలోనే వివాదాల‌ను కొన‌సాగించారు త‌ప్ప వివాదాల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు ఏ ఒక్క‌రూ ప్ర‌య‌త్నించ‌లేదు. దీంతో జ‌లాల విష‌యంలో ఇరు రాష్ట్రాల స‌మ‌స్య ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారింది. అప్ప‌ట్లో ఈ విష‌యంపై గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ జోక్యం చేసుకోక‌పోవ‌డంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయ‌న మౌనంగా ఉన్నార‌ని, జోక్యం చేసుకుని జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించాల‌ని ప‌లు సూచ‌న‌లు వ‌చ్చాయి.

అయిన‌ప్ప‌టికీ.. న‌ర‌సింహ‌న్ మౌనంగానే ఉండిపోయారు. ఇక‌, ఇప్పుడు తాజాగా కేంద్ర‌మే మ‌రోసారి ఇరు రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు న‌డుం బిగించింది. ఈ క్ర‌మంలో ఈసారి ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌ - చంద్ర‌బాబుల‌ను కేంద్ర జ‌ల‌వ‌న‌రుల మంత్రి ఉమాభార‌తి స్వ‌యంగా ఢిల్లీకి ఆహ్వానించారు. జ‌ల స‌మ‌స్య‌ల‌పై కూర్చుని మ‌ట్లాడుకుందామ‌ని చెప్పారు. ఈ ప్ర‌తిపాద‌న‌కు ఇద్ద‌రు సీఎంలు అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. దీంతో రేపో మాపో అపాయింట్‌మెంట్లు స‌రిచూసుకుని ఇద్ద‌రూ ఢిల్లీ వెళ్లే ప్లాన్లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదే జ‌రిగి.. జ‌ల వ‌న‌రుల స‌మ‌స్య ఓ కొలిక్కివ‌స్తే.. ఇరు రాష్ట్రాలూ అనుభ‌విస్తున్న ప్ర‌ధాన త‌ల‌నొప్పి వ‌దిలిపోనుంద‌ని నిపుణులు అంటున్నారు. కాగా, ఈ భేటీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సూచ‌న‌ల నేప‌థ్యంలోనే కేంద్రం చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం. ఇరు రాష్ట్రాల మ‌ధ్య రాజీ చేయ‌డంలో ఇప్ప‌టికే అనేక విష‌యాల‌పై శ్ర‌ద్ధ చూపిన గ‌వ‌ర్న‌ర్ జ‌లాల విష‌యాన్ని కేంద్రానికే రిఫ‌ర్ చేశార‌ని అంటున్నారు రాజ్‌భ‌వ‌న్ అధికారులు.