Begin typing your search above and press return to search.

మోదీజీ.. ర‌క్ష‌ణ శాఖ‌తో ఆట‌లొద్దు!

By:  Tupaki Desk   |   19 Aug 2017 9:02 AM GMT
మోదీజీ.. ర‌క్ష‌ణ శాఖ‌తో ఆట‌లొద్దు!
X
దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆడుకుంటున్నారా? ముఖ్యంగా దేశ ర‌క్ష‌ణ విష‌యంలో ఆయ‌న సీరియ‌స్‌గా లేరా? ఒక ప‌క్క చైనా స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతుంటే, మ‌రోప‌క్క‌ - పాకిస్థాన్‌.. చొర‌బాట్ల‌ను కొన‌సాగిస్తున్న త‌రుణంలో భార‌త ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన ప్ర‌ధాని నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ మిత్ర ప‌క్షం శివ‌సేన అధినేత ఉద్ద‌వ్ ఠాక్రే! చైనాతో యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న ప్ర‌స్తుత త‌రుణంలో భార‌త ర‌క్ష‌ణ శాఖ విష‌యంలో ప్ర‌ధాని మోదీ సీరియ‌స్‌ గా ఉండాల‌ని ఠాక్రే అనడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఠాక్రే వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి మోదీ ర‌క్ష‌ణ శాఖ‌తో ఆడుకుంటున్నార‌నే భావం క‌లుగుతోంది.

దేశానికి అత్యంత కీల‌క‌మైన ర‌క్ష‌ణ రంగానికి గ‌త కొన్నాళ్లుగా మంత్రి లేరు. గ‌తంలో దీనిని నిర్వ‌హించిన మ‌నోహ‌ర్ ప‌ర్రీక‌ర్‌.. గోవా సీఎంగా వెళ్లిపోవ‌డంతో ర‌క్ష‌ణ శాఖ మంత్రి సీటు ఖాళీ అయింది. దీంతో దీనిని తాత్కాలికంగా నిర్వ‌హించేంలా.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, ఆయ‌న జీఎస్టీ త‌దిత‌ర ఆర్థిక విష‌యాల్లో మునిగిపోయారు త‌ప్ప దేశ ర‌క్ష‌ణ వ్య‌వ‌హారాల‌పై దృష్టి పెట్ట‌లేదు. ఇప్పుడు ఇదే విష‌యాన్ని వేలెత్తి చూపిన ఠాక్రే.. అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో ర‌క్ష‌ణ శాఖ విష‌యంలో మోదీ సీరియ‌స్‌ గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

చైనా స‌హా పాక్ నుంచి దేశానికి బెదిరింపులు - ఉగ్ర చొర‌బాట్లు పెరిగిపోయాయ‌ని పేర్కొన్నారు. ``దేశంలో ప్ర‌స్తుత వాతావ‌ర‌ణం.. ఒక చేత్తో చైనాకు బుద్ధి చెప్పడం - మ‌రో చేత్తో పాక్ నుంచి జ‌రుగుతున్న చొర‌బాట్ల‌ను నిలుపుద‌ల చేయ‌డం. అయితే, ఈ విష‌యంలో మోదీ సీరియ‌స్‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది`` అని ఠాక్రే అన్నారు. ఈ సంద‌ర్భంగా గోవాలో జ‌రిగిన ఓ ఘ‌ట‌నను ఠాక్రే ప్ర‌ధానంగా ప్ర‌స్థావించారు. గోవాలో ఉప ఎన్నిక జ‌రుగుతోంద‌ని, దీనిలో పోటీ చేస్తున్న ప్ర‌స్తుత సీఎం మ‌నోహ‌ర ప‌ర్రీక‌ర్‌.. తాను అక్క‌డ గెలిస్తే.. సీఎంగా కొన‌సాగుతాన‌ని, లేకుంటే దేశ ర‌క్ష‌ణ మంత్రిగా తిరిగి వెళ్లిపోతాన‌ని చెబుతున్నార‌ని.. దీనిని బ‌ట్టి ర‌క్ష‌ణ శాఖ అంటే.. ఆట‌లుగా ఉందా? అని ఠాక్రే తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌నోహ‌ర్ ప‌ర్రీక‌ర్‌ కే ర‌క్ష‌ణ శాఖ సీటును రిజ‌ర్వ్ చేశారా? అని కూడా ఠాక్రే నిప్పులు చెరిగారు. ఆయ‌న కోసం దేశ ర‌క్ష‌ణను ఫ‌ణంగా పెట్టొద్ద‌ని ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేశారు. ర‌క్ష‌ణ శాఖ‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని, ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు పోవాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపైనా ఠాక్రే నిప్పులు చెరిగారు. పంట రుణాల మాఫీ విష‌యంలో సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ నాట‌కం ఆడుతున్నార‌ని అన్నారు. ల‌బ్ధి పొందిన వారి వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు. చేనేత రుణాల విష‌యంనూ ఎంత మందికి ఇచ్చారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.