Begin typing your search above and press return to search.

చైనాకు బీపీ పెంచేస్తున్న ట్రంప్‌

By:  Tupaki Desk   |   25 May 2017 1:29 PM GMT
చైనాకు బీపీ పెంచేస్తున్న ట్రంప్‌
X
త‌న మానాన తాను ప‌నిచేసుకోవ‌డం త‌క్కువ‌, వివాదాల్లో త‌ల‌దూర్చ‌డం ఎక్కువ అన్న‌ట్లుగా ఉండే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మ‌రో దుందుడుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇన్నాళ్లు త‌న ఇలాక అయిన అమెరికాలో ప్ర‌భావం చూపేలా ప‌లు నిర్ణ‌యాలు తీసుకొని ర‌చ్చ‌ర‌చ్చ చేసేసిన ట్రంప్..ఇప్పుడు విదేశాంగ విధానాల్లోనూ అదే తీరును అవ‌లంభిస్తున్నట్లు క‌నిపిస్తోంది తాజాగా డ్రాగ‌న్ కంట్రీ అయిన చైనాను ట్రంప్‌ కెలికారు. మొండిత‌నానికి మారుపేరైనా చైనా దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు, దిబ్బలు, ఇసుక రేవులు నిర్మించింది. ఈ దీవులు వివాదంలో ఉండ‌గా...వీటిలో ఒకటైన స్ప్రాట్లీ దీవులలోని మిస్‌చీఫ్‌ రీఫ్‌కు అత్యంత సమీపంలో యూఎస్‌ఎస్‌ డీవే యుద్ధనౌక సంచరించడం ఇప్పుడు క‌ల‌క‌లానికి దారితీసింది.

పొరుగుదేశాలతో పలు వివాదాలు ఉన్నా లెక్కచేయకుండా దక్షిణ సముద్ర జలాల‌పై ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తున్న చైనా నిర్మించిన కృత్రిమ దీవుల్లో సుమారు 12 నాటిక‌న్ మైళ్ల దూరం అమెరికా నేవీ యుద్ధ‌నౌక ప్ర‌యాణించింద‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌ అంత‌ర్జాతీయ ప‌రిణామాల్లో చైనా-అమెరికా మ‌ధ్య గ్యాప్‌ను మ‌రింత‌గా పెంచుతుంద‌ని అంటున్నారు. అధ్య‌క్షుడైన త‌ర్వాత తొలిసారి చైనాకు బీపీ పెంచే చ‌ర్య‌ను ట్రంప్ స‌ర్కారు చేసింద‌ని అంటున్నారు.

మ‌రోవైపు త‌న‌ను రెచ్చ‌గొడుతున్న‌ ఉత్త‌ర‌కొరియా విష‌యంలో చైనా స‌హాయం కోరుతూ ఇలా నేవీ యుద్ధ‌నౌక‌ను చైనా త‌న‌దిగా పేర్కొంటున్న ప్రాంతంలోకి ఎందుకు పంపించారో అంతుచిక్క‌డం లేద‌ని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అంత‌ర్జాతీయ తీర్పును అనుస‌రించే ట్రంప్ ఇలా వ్య‌వ‌హ‌రించార‌ని అమెరికా అధికారులు చెప్తున్నారు. ద‌క్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం చెల్లబోదంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇటీవ‌ల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్వేచ్చా ప‌రిధిలోకి అమెరికా నౌక‌లు వెళ్లాయ‌ని వారు విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/