Begin typing your search above and press return to search.

అమెరికా దెబ్బ‌కు మ‌న ఐటీ కంపెనీలు కుదేల్‌

By:  Tupaki Desk   |   27 May 2016 9:40 AM GMT
అమెరికా దెబ్బ‌కు మ‌న ఐటీ కంపెనీలు కుదేల్‌
X
ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రేంట్స్ గా పేరుపొందిన అగ్ర‌రాజ్యం అమెరికా ఇపుడు ఆ వ‌ల‌స‌దారులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే దిశ‌గా అడుగులు వేసింది. కొద్దికాలం క్రితం చ‌దువుకునేందుకు వ‌స్తున్న విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అమెరికా ఆ త‌ర్వాత ఇప్ప‌టికే ఆ దేశంలో ఉద్యోగం చేస్తున్న వారిపై త‌న ప్ర‌తాపం చూపింది. ఇపుడు ఆ దేశం చూపు హెచ్ 1బీ - ఎల్1 వీసాల‌పై ప‌డింది.

హెచ్ 1బీ - ఎల్1 వీసాల్లోని కొన్ని కేటగిరీల వీసాల ఫీజులను అమెరికా భారీగా పెంచింది. డిసెంబర్ 18 - 2015 తర్వా హెచ్1బీలోని కొన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు అదనంగా ఒక్కో వీసాకు $4000 డాల‌ర్లు చెల్లించాలని యూఎస్ సిటిజన్‌ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్‌ సీఐఎస్) స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు త‌న వెబ్‌ సైట్‌ లో ప్రకటించింది. అలాగే..ఎల్1ఏ - ఎల్2బీ దరఖాస్తుదారులు $4500 డాల‌ర్లు అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ పెంపు సెప్టెంబర్ 30 - 2025 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. అమెరికాలో పూర్తిస్థాయి ఉద్యోగస్తులున్న వారి విష‌యంలోనూ, పార్ట్‌ టైమ్ ఉద్యోగుస్తులుగా ఉన్న వారికి సైతం ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని తేల్చిచెప్పింది. హెచ్1బీ - లేదా ఎల్1ఏ - ఎల్1బీ నాన్ ఇమిగ్రంట్ స్టేటస్ వీసాదారులై ఉన్న కంపెనీలకు ఈ పెంపు వర్తిస్తుందని యూఎస్‌ సీఐఎస్ తెలిపింది. ఈ ఫీజు సాధారణ - ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు - ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఫీజు - అమెరికన్ కాంపిటీటివ్‌ నెస్ అండ్ వర్క్‌ఫోర్స్ ఇంప్రూవ్‌ మెంట్ యాక్ట్ ఫీజులకు అద‌నమని స్పష్టం చేసింది.

అమెరికాలో ఉన్న హెచ్1బీ వీసాల్లో మ‌న‌దేశానికి చెంద‌న వారివే ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో భార‌తీయ ఐటీ కంపెనీ తీవ్ర ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. త్వ‌ర‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్న సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ ఫీజు వ‌డ్డ‌న‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా... ఒబామా గ‌త ఏడాది డిసెంబర్ 18న సంతకం చేయడంతో సంబంధిత చట్టం అమల్లోకి రావ‌డం గ‌మ‌నార్హం.