Begin typing your search above and press return to search.

అమెరికాలో భార‌తీయ జంట‌కు ఏడాది జైలు!

By:  Tupaki Desk   |   21 March 2018 8:54 AM GMT
అమెరికాలో భార‌తీయ జంట‌కు ఏడాది జైలు!
X
త‌న కుటుంబ ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో - డ‌బ్బు సంపాదించేందుకు విదేశాల‌లో ప‌ని చేసేందుకు చాలామంది వెళుతుంటారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల‌కు వెళ్లేందుకు భార‌త్ - పాకిస్థాన్ - బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది సుముఖ‌త చూపుతుంటారు. అయితే, కొంత‌మంది దళారుల చేతిలో మోస‌పోవ‌డం....గ‌ల్ఫ్ దేశాల్లో త‌మ‌కు ముందుగా కేటాయించి ఉద్యోగం కాకుండా వెట్టి చాకిరి చేయించ‌డం వంటి ఘ‌ట‌న‌ల గురించి వింటూనే ఉన్నాం. అయితే, ఈ త‌ర‌హా హ్యూమ‌న్ ట్రాఫికింగ్....గ‌ల్ఫ్ దేశాల‌కే ప‌రిమితం కాలేదు. తాజాగా, అమెరికాలో ఓ భార‌తీయ వ్య‌క్తితో వెట్టి చాకిరి చేయించి, బంధించి ఉంచిన ఘ‌ట‌న‌పై అక్క‌డి కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఆ వ్య‌క్తికి అన్యాయం చేసిన య‌జ‌మానుల‌కు ఏడాదిపాటు జైలు శిక్ష‌తో పాటు 25 ల‌క్ష‌ల జ‌రిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఏడాది శిక్ష అనంత‌రం వారిద్ద‌రికీ రెండేళ్ల‌పాటు దేశ బ‌హిష్క‌ర‌ణ విధించింది.

అమెరికాలోని నెబ్రాస్కాలో ఉన్న కింబాల్ లో విష్ణుభాయ్ చౌద‌రి(50), లీలాబెన్ చౌద‌రి(44) లు ఓ సెవెన్ స్టార్ హోట‌ల్ ను నిర్వ‌హిస్తున్నారు. 2011 - 2013 మ‌ధ్య కాలంలో త‌మ హోట‌ల్ లో ప‌నిచేసేందుకు ఓ భార‌తీయుడిని వారు స‌రైన ఇమ్మిగ్రేష‌న్ ప‌త్రాలు లేకుండానే అమెరికాకు ర‌ప్పించారు. ఆ వ్య‌క్తితో వారిద్ద‌రూ వారానికి ఒక్క‌రోజు కూడా సెల‌వు ఇవ్వ‌కుండా ప‌నిచేయించేవారు. అత‌డితో రోజంతా ఎక్కువ‌సేపు ప‌ని చేయించేవారు. లాండ్రీ ప‌నుల‌తో పాటు బాత్రూమ్ లు కూడా క‌డిగించేవారు. వెట్టి చాకిరి చేయించుకొని జీతం కూడా ఇవ్వ‌లేదు. ఆ వ్య‌క్తి త‌మ‌కు బాకీ ఉన్నాడ‌ని, అందుకే చేసిన ప‌నికి జీతం ఇవ్వ‌కుండా వేధించేవారు. ఆమెకు న‌చ్చిన విధంగా బాత్రూం క‌డ‌గ‌లేద‌ని లీలా బెన్ ...ఆ వ్య‌క్తిపై చేయి చేసుకున్నారు. ఆ వ్య‌క్తి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఆంక్ష‌లు విధించారు. దీంతో, ఆ హోట‌ల్ కు వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్ - స్థానిక‌ అధికారుల సాయంతో ఆ వ్య‌క్తి అక్క‌డ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. వారిపై ఫిర్యాదు చేయ‌డంతో కోర్టు ...ఆ జంట‌కు ఏడాది జైలు శిక్ష‌ - 25 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. అంతేకాకుండా, ఏడాది శిక్ష పూర్త‌యిన త‌ర్వాత‌ వారిద్ద‌రికీ రెండేళ్ల‌పాటు దేశ బ‌హిష్క‌ర‌ణ విధించింది. మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌, హ్యూమ‌న్ ట్రాఫికింగ్ కు పాల్ప‌డే వారిని ఉపేక్షించ‌బోమ‌ని తీర్పునిచ్చిన జ‌డ్జి తెలిపారు.