Begin typing your search above and press return to search.

కిమ్ బాంబు వేస్తేనే యుద్ధం..లేదంటే గ‌ప్‌ చుప్‌

By:  Tupaki Desk   |   17 Oct 2017 11:48 AM GMT
కిమ్ బాంబు వేస్తేనే యుద్ధం..లేదంటే గ‌ప్‌ చుప్‌
X
ఉత్త‌రకొరియా-అమెరికాల మ‌ధ్య సాగుతున్న మాట‌ల యుద్ధం మ‌రో మలుపు తిరిగింది. ఇటు అగ్ర‌రాజ్యం - అటు ఉత్త‌ర‌కొరియా యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మైన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్‌ సన్ దీనికి కొంచెం ట్విస్ట్ జోడించారు. ఉత్తర కొరియా నుంచి మొదటి బాంబు పడేంత వరకూ తాము వేచిచూస్తామని, అప్పటివరకూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఆ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పై ఒత్తిడి తీసుకొస్తామని టిల్లర్‌ సన్‌ తాజాగా వ్యాఖ్యానించారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారని, ఆయనే స్వయంగా ఈ విషయాన్ని తెలిపినట్టు టిల్లర్‌ సన్‌ అన్నారు.

ఉత్తర కొరియాతో నెలకొన్న వివాదంపై దౌత్య పరంగా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు సాగించాలని ట్రంప్‌ వెల్లడించారని, తొలి బాంబు పడేవరకూ చర్చలకు ఉండే అవకాశాలపై పరిశీలిస్తూనే ఉండాలని స్పష్టం చేసినట్టు టిల్ల‌ర్‌ స‌న్ మీడియాతో చెప్పారు. ఇది పూర్తిగా విఫలమైతే మాత్రం యుద్ధం మినహా మరో ఆలోచన ఉండబోదని తెలిపారు. దీనిపై ఉత్తర కొరియా స్పందిస్తూ... అమెరికా నేతృత్వంలో ప‌లు దేశాధినేత‌లు తమపై దండ్రయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది.

ఇదిలాఉండ‌గా...ఉత్త‌రకొరియా క‌ద‌లిక‌ల‌పై పైకి శాంతివ‌చ‌నాలు వ‌ల్లిస్తున్న‌ప్ప‌టికీ అమెరికా వేస్తున్న అడుగులు - చేస్తున్న ఏర్పాట్లు మాత్రం దిమ్మ‌తిరిగే రేంజ్‌ లో ఉన్నాయ‌ని అంటున్నారు. యుద్ధ నౌకల్ని(రొనాల్డ్‌ రీగన్‌) - అణు జలాంతర్గాముల్ని (మిచిగాన్‌) కొరియా ద్వీపకల్పంలో మోహరిస్తోంది.అత్యంత పెద్దదైన - శక్తివంతమైన మిచిగాన్‌ జలాంతర్గామిని ద.కొరియా తీరానికి అమెరికా చేర్చిందంటే దాని అర్థం - ఉత్తర కొరియాపై ఎప్పు డైనా - ఏ క్షణమైనా దాడులు చేస్తామని బెదిరించటమేన‌ని నిపుణులు చెప్తున్నారు. ఈ రెండింటినీ ఉత్త‌ర‌కొరియా స‌మీపంలోకి చేర్చిన త‌ర్వాత‌ - దక్షిణ‌కొరియా- జపాన్‌ లతో కలిసి అమెరికా సైన్యం సంయుక్త విన్యాసాల్ని నిర్వహించనుంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఉన్న 'రొనాల్డ్‌ రీగన్‌' యుద్ధనౌక కూడా కొరియా ద్వీప కల్పం దిశగా వస్తోంది. త‌ద్వారా ఉత్త‌ర‌కొరియా ఒకవేళ బాలిస్టిక్‌ క్షిపణి దాడి చేస్తే, దానిని అడ్డుకోవటం ఎలా ? జలాంతర్గాములు - యుద్ధనౌకలతో సైనిక ఆపరేషన్లను ఎలా నిర్వహించాలి ? అన్నదాని గురించి రిహార్సల్స్‌ మొదులు పెట్టినట్టు రక్షణ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. ఇందుకోసమే తాజాగా, అణు క్షిపణి దాడులు చేయగల 'యుఎస్‌ ఎస్‌ మిచిగాన్‌' జలాంతర్గామి దక్షిణ కొరియా నౌకాకేంద్రం బుసాన్‌ కు చేరుకుంది.

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన జలాంతర్గా మికిగా 'మిచిగాన్‌'కు గుర్తింపు ఉంది. మిచిగాన్‌ జలాంతర్గామి అత్యున్నత స్థాయి సాంకేతిక - సమాచార వ్యవస్థను కలిగి ఉంది.మిచిగాన్‌ అణుజలాంతర్గామికి ఉన్న మరో ప్రత్యేకత, సైనిక బలగాల ప్రత్యేక ఆపరేషన్‌ కు మద్దతుగా దాడుల్లో పాలుపంచుకుంటుంది. దీని నుండి జరిగే అత్యంత భీకరమైన క్షిపణి దాడుల్ని అడ్డుకోవటం సామాన్య విషయం కాదు. ప్రత్యర్థి దేశం వద్ద బలమైన - ఉన్నతస్థాయి క్షిపణి నిరోధక వ్యవస్థ ఉండాల్సిందే. అమెరికాలోని బ్రెమెర్టాన్‌ తీరం నుంచి బయల్దేరిన ఈజలాంతర్గామి - తొలుత పసిఫిక్‌ మహాసముద్రం లోని గువామ్‌ దీవికి చేరుకుంది. అక్కడ్నుంచి 2,800 కిమీ దూరంలో ఉన్న బుసాన్‌ కు శుక్రవారం చేరుకుంది.