Begin typing your search above and press return to search.

మా దాడితో అర‌గంట‌లో 10 కోట్ల మంది చ‌నిపోతారు

By:  Tupaki Desk   |   19 Aug 2017 7:50 AM GMT
మా దాడితో అర‌గంట‌లో 10 కోట్ల మంది చ‌నిపోతారు
X
అమెరికా - ఉత్త‌ర కొరియా మ‌ధ్య న‌డుస్తున్న లడాయి తెలిసిందే. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి త‌న చేతిలో ఉన్న అణ్వాయుధాన్ని అమెరికా మీద ప్ర‌యోగించాల‌ని త‌పించే ఉత్త‌ర‌కొరియా నియంత తీరు ప్ర‌పంచ దేశాల్ని వ‌ణికిస్తోంది.
తమ సొంత‌మైన అణుసామ‌ర్థ్యాన్ని అమెరికాకు చెందిన గువాం ద్వీపంపై తొలుత దాడి చేస్తామ‌ని ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ అదే ప‌నిగా హెచ్చ‌రిక‌లు చేయ‌టం.. దీనికి అమెరికా ఘాటు రిప్లై ఇవ్వ‌టం తెలిసిందే. అయితే.. ఈ ఉద్రిక్త ప‌రిస్థితులు తాత్కాలికంగా త‌గ్గ‌టం.. గువాం ద్వీపంపై దాడి చేయాల‌న్న నిర్ణ‌యాన్ని కిమ్ వెన‌క్కి తీసుకున్నారు. కిమ్ నిర్ణ‌యాన్ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అభినందించారు.

మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పారు. అయితే.. ట్రంప్ పొగిడిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే అమెరికా ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శి జేమ్స్ మాటిస్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. యుద్ధం జ‌రిగితే ఎంత న‌ష్టం వాటిల్లుతుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న త‌న మాట‌ల‌తో చెప్పి ప్ర‌పంచం హ‌డ‌లిపోయేలా మాట్లాడారు.

అమెరికా క‌నుక పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఆయ‌న వివ‌రించారు. గువాం ద్వీపంపై ఉత్త‌ర‌కొరియా కానీ దాడి చేసిన‌ ప‌క్షంలో తాము వెన‌క్కి త‌గ్గ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ యుద్ధానికి కానీ తాము దిగితే అదొక్క ఉత్త‌ర‌కొరియాకు మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని.. ఆ దేశానికి ప‌క్క‌నే ఉన్న ద‌క్షిణ కొరియా.. జ‌పాన్ దేశాలు కూడా న‌ష్ట‌పోతాయ‌ని పేర్కొన్నారు.

ఆ తీవ్ర‌త ఊహించే తాము సంయ‌మ‌నం పాటిస్తున్నామ‌న్నారు. అమెరికా అణుదాడి జ‌రిపితే ఈ మూడు దేశాల్లో శ‌వాలు గుట్ట‌లు.. గుట్ట‌లుగా క‌నిపించేవ‌ని.. దాని తీవ్ర‌త ఊహించలేనంత భ‌యంక‌రంగా ఉంటుంద‌న్నారు. 30 సెక‌న్ల వ్య‌వ‌ధిలో 30వేల మంది మ‌ర‌ణిస్తార‌ని.. కేవ‌లం అర‌గంట వ్య‌వ‌ధిలో 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతార‌ని చెప్పారు. అలా జ‌ర‌గ‌కూడ‌ద‌నే అమెరికా ఓపిగ్గా ఉంద‌న్నారు. అణు దాడుల ప్ర‌భావం ఒక్క ప్రాంతానికే ప‌రిమితం కాద‌ని.. ప‌లు దేశాల మీద ఉంటుంద‌ని పేర్కొన్నారు. మ‌రింత ఘాటుగా ర‌క్ష‌ణ శాఖ కార్య‌దర్శి చేసిన వ్యాఖ్య‌లకు ఉత్త‌ర‌కొరియా ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది చెప్ప‌క త‌ప్ప‌దు.