Begin typing your search above and press return to search.

అమెరికా ర‌క్ష‌ణ మంత్రి ఎందుకు వ‌స్తున్న‌ట్టో?

By:  Tupaki Desk   |   26 Sep 2017 6:36 AM GMT
అమెరికా ర‌క్ష‌ణ మంత్రి ఎందుకు వ‌స్తున్న‌ట్టో?
X
ప్ర‌స్తుత ప్ర‌పంచంలో అమెరికా అత్యంత స‌న్నిహిత సంబంధాలు నెర‌పుతున్న అతికొద్ది దేశాల్లో భార‌త్ కూడా ఒక‌టి. వాస్త‌వానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ఎంపిక కాక‌ముందే ఒబామా హ‌యాంలోనే భార‌త్ - అమెరికాల మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌డ్డాయి. దీనికి మ‌న చొర‌వ కంటే కూడా అమెరికా చొర‌వే ఎక్కువ ఉండ‌టం గ‌మ‌నార్హం. ముఖ్యంగా ఏక ధ్రువ ప్ర‌పంచంలో అమెరికా త‌ర్వాత సూప‌ర్ ప‌వ‌ర్‌ గా ఎద‌గాల‌నుకుంటున్న చైనాను అడ్డుకోవాలంటే అది ఒక్క అమెరికా వ‌ల్ల కాద‌నే సంగ‌తి ఆ దేశ పాల‌కుల‌కు తెలుసు. చైనాకు పొరుగునే ఉంటూ ప్ర‌పంచంలోనే శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాను మ‌చ్చిక చేసుకుంటేనే ఇది సాధ్య‌మ‌నే సంగ‌తిని అమెరికా పాల‌కులు తెలుసుకున్నారు.

మ‌రోవైపు భార‌త్ కూడా అమెరికాతో సంబంధాలు పెంపొందించుకోవ‌డానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్ర‌పంచంలో భార‌తీయులు ఎక్కువ‌గా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒక‌టి. అంతేకాకుండా ఐటీ సేవ‌ల ఔట్‌ సోర్సింగ్‌ కు భార‌త్‌ పైనే అమెరికా ఆధార‌ప‌డుతోంది. ఫార్మాస్యూటిక‌ల్స్ కూడా భార‌త్ నుంచి ఎక్కువ‌గా అమెరికాకు ఉత్ప‌త్తి అవుతున్నాయి. ర‌ష్యా ప‌త‌నం త‌ర్వాత ప్ర‌పంచంలో అమెరికా ఒక్క‌టే సూప‌ర్ ప‌వ‌ర్‌ గా వెలుగొందుతోంది. మ‌న‌కు స‌రిహ‌ద్దు దేశాలైన చైనా - పాకిస్థాన్‌ ల‌తో స‌రిహ‌ద్దు త‌గాదాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల‌తో ఎప్పుడైనా యుద్ధం వ‌చ్చే ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో భార‌త్.. సైనిక అవ‌స‌రాల కోసం ప్ర‌ధానంగా అమెరికాపైనే ఆధార‌ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లే ఉద్దేశంతో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాట్టిస్ వచ్చే వారం భారత్‌ లో పర్యటించనున్నారు. భార‌త్‌ కు ఎఫ్-16 యుద్ధ విమానాల విక్రయం - దక్షిణాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితిపై ఆయన ప్రధానంగా భారత నేతలతో చర్చించనున్నార‌ని తెలుస్తోంది. మాట్టిస్ తన పర్యటనలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ - జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ తో చర్చలు జరపడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశానికి చెందిన ఒక కేబినెట్ స్థాయి మంత్రి భారత్ పర్యటించడం ఇదే మొదటిసారి.

భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మరింత ఎత్తుకు చేర్చ‌డానికి అవసరమైన సంస్థాగత వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి - అఫ్గానిస్థాన్‌ లో వ్యూహాత్మక సహకారాన్ని చాటిచెప్పడానికి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర వాణిజ్యం - అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటనను మాట్టిస్ ఉపయోగించుకొంటారని స‌మాచారం. అలాగే రక్షణ సహకారం - వాణిజ్య కార్యక్రమం కింద కొత్త ప్రాజెక్టులను గుర్తించొచ్చు. మాట్టిస్ పర్యటనకు ముందు సన్నాహకంగా అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా పెంటగాన్‌ లో ఆయనను కలిశారు. సంప్రదాయానికి భిన్నంగా సర్నాను స్వాగతించడానికి మాట్టిస్ స్వయంగా రావడం అమెరికా భార‌త్‌కు ఇస్తున్న‌ప్రాధాన్య‌త‌ను చెప్ప‌క‌నే చెబుతోంది.