మొదటిసారి మదరసాల్లో ఆ పని చేస్తున్నారట

Sat Aug 12 2017 09:56:29 GMT+0530 (IST)

భారతదేశంలో చిత్రమైన పరిస్థితులు ఉంటాయి. నిజానికి ఇలాంటివి మరే దేశంలో అయినా చర్చకు వస్తాయో లేదో కానీ.. మన దేశంలో మాత్రం ఇలాంటివి అక్కడక్కడా కనిపిస్తాయి. నిజానికి ఇలాంటి వాటికి కారణం గత ప్రభుత్వాల పని తీరు మాత్రమే. ఒక దేశంలో దేశ జాతీయ జెండాను ఎగరవేయటానికి వచ్చే ఇబ్బందులేమిటో ఒక పట్టాన అర్థం కావు.

ఒక దేశంలో పలు మతాలు ఉన్నప్పటికీ దేశం.. జాతీయత తర్వాతే మరేదైనా అన్నట్లు ఉంటుంది. కానీ.. భారత్ లోనే అందుకు భిన్నమైన పరిస్థితి ఉంటుంది. దేశంలో స్వాతంత్య్ర దినోత్సవం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎందుకు ఆవిష్కరించరన్న దానికి స్పష్టమైన కారణం ఎవరూ చెప్పరు. అలాంటి తీరును మొగ్గలోనే తుంచివేయాల్సి ఉన్నా.. ఓటు బ్యాంకు రాజకీయాలతో అలాంటి వాటిని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం కనిపిస్తుంది.

ఇలాంటివి సహజంగానే జాతీయవాదుల్లో అసంతృప్తిని.. ఆగ్రహాన్ని పెంచేలా చేస్తుంది. అయితే.. ఇలాంటి  భావాల్ని  వ్యక్తం చేసే వారిని.. వారి మతకోణాల్లో చూసే వైనం కొంత గందరగోళానికి దారి తీస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తరప్రదేశ్ సర్కారు రాష్ట్రంలోని మదరసా కమిటీలను ఆగస్టు 15 వేడుకల్ని నిర్వహించాలని కోరింది. జెండా ఆవిష్కరణతో పాటు.. జాతీయ గేయాన్ని ఆలపించాలని పేర్కొంది. దీనికి మదరసా కమిటీలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి. మొట్టమొదటిసారి ఆగస్టు 15 వేడుకలను నిర్వహించేందుకు మదరసాలు సిద్ధమయ్యాయి.

పంద్రాగస్టు సందర్భంగా స్వాతంత్య్ర సమరయోథులకు నివాళులు అర్పించటంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించాలని సీఎం యోగి మదరసా కమిటీలను కోరారు. దీనికి అంగీకరిస్తూ.. రాష్ట్రంలోని ఎనిమిది వేల మదరసాల్లో ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేసి.. వేడుకల్ని నిర్వహించనున్నారు. యోగి సర్కారు నిర్ణయంతో జరగనున్న ఈ వేడుకలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.