Begin typing your search above and press return to search.

యోగి సంచ‌ల‌నం..కీల‌క వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు క‌ట్‌?

By:  Tupaki Desk   |   18 Dec 2018 5:24 PM GMT
యోగి సంచ‌ల‌నం..కీల‌క వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు క‌ట్‌?
X
బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు పెట్టింది పేర‌నే సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న‌ - వివాదాస్ప‌ద చ‌ర్య‌లకు పాల్ప‌డే యోగి తాజాగా మ‌రో ముఖ్య‌మైన అంశంపై కీల‌క నిర్ణ‌యం తీసుకోన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. యూపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు వాడి వేడిగా సాగేలా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా యాదవులు - కూర్మీల రిజర్వేషన్లలో భారీ కోత విధించాలన్న ప్రతిపాదనను ఈసారి అసెంబ్లీ ముందుకు వస్తోంది. దీనికి సీఎం యోగి మూలం కావ‌డం ఇప్పుడు ఈ ర‌చ్చకు కార‌ణంగా మారింది.

యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) రిజర్వేషన్లను పరిశీలించేందుకు జస్టిస్‌ రాఘవేంద్ర కుమార్‌ నేతృత్వంలో ఓ కమిషన్‌ను వేశారు. 79 ఉప కులాల స్థితిగతులను పరిశీలించి 400 పేజీల నివేదిక కమిషన్ ఇచ్చింది .రాజకీయంగా బాగా లబ్ది పొందిన యాదవులు - కూర్మీలకు రిజర్వేషన్లను కుదించాలని ఈ కమిషన్‌ సూచించింది. వీరి రిజర్వేషన్లను కేవలం 7శాతానికే పరిమితం చేయాలని ప్రతిపాదించింది. అత్యంత వెనుకబడిన రాజ్‌ భర్ - ఘోసి - ఖురేషి (ముస్లిం)లకు 9 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కమిషన్‌ ప్రతిపాదించింది. వీరికి క్లాస్‌ త్రి - క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని ప్రతిపాదించింది. 1977లో ఓబీసీలకు 17 శాతం రిజర్వేషన్‌ ఇవ్వగా - 1992లో దీన్ని 27 శాతానికి పెంచారు. అయితే అపుడే కేవలం 54 ఉప కులాలు మాత్రమే ఉన్నాయి. తరవాత అనేక కులాలు చేరాయి. అత్యంత వెనుకబడిన కులాలు (మోస్ట్‌ బ్యాక్‌ వర్డ్‌ క్యాస్ట్స్‌)కు 70 దాకా ఉన్నాయి.. వీరికి రిజర్వేషన్‌ పెంచాలని కమిషన్‌ ప్రతిపాదించింది. ఈ సంచ‌ల‌న నివేదికను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

అయితే, కమిషన్‌ ప్రతిపాదనలను రాష్ట్ర సీఎం యోగి ఓట్ల కోణంలో చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విపక్షాలకు చెందిన యాదవుల రిజర్వేషన్లకు కోత వేయడంతో పాటు జనాభాపరంగా అధికంగా ఉన్నఇతర కులాలకు రిజర్వేషన్‌ కల్పించి... వారిని ఆకర్షించాలని యోగి భావిస్తున్నారు. అందుకే ముస్లిములలో అధికంగా ఉండే ఖరేషీలపై కన్నేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, కమిషన్‌ ప్రతిపాదనలను బట్టి చూస్తే...యాదవులు - కూర్మీలు - చౌరాసియాలతో పాటు పటేల్‌ కులాలకు రిజర్వేషన్లను 7 శాతానికి పరిమితం చేయాలి. గుజ్జర్‌ - లోధ్‌ - కుష్వారా - షక్యా - తేలి - సాహు - శైని - మాలి - నాయి (నాయీ బ్రాహ్మణులు)లకు 11 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని... అత్యంత వెనుకబడిన ఘోషి - ఖరేషి - రాజభర్‌ - బింద్‌ - నిషాద్‌ కులాలకు 9 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, దీనిపై ఇప్ప‌టికే విప‌క్షాలు త‌మ గ‌ళం వినిపించడం మొద‌లుపెట్టాయి. ఈ వివాదాన్ని యోగి ఎలా ప‌రిష్క‌రిస్తారో మ‌రి.