Begin typing your search above and press return to search.

నీరవ్‌ అలా వెళ్లాడు.. ఇలా చిక్కాడు..!

By:  Tupaki Desk   |   21 March 2019 6:06 AM GMT
నీరవ్‌ అలా వెళ్లాడు.. ఇలా చిక్కాడు..!
X
భారత్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్ల డబ్బు ఎగ్గొట్టిన కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీ మొత్తానికి పోలీసులకు చిక్కాడు. పంజాబ్‌ బ్యాంకును మోసం చేసి ఇండియా నుంచి పారిపోయిన నీరవ్‌ లండన్‌లో తప్పించుకు తిరుగుతున్నట్లు ఇటీవల బయటపడింది. ఆయన లండన్‌లోని వీధుల్లో సంచరిస్తున్నట్లు ఓ మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నీరవ్‌ ను అప్పగించాల్సిందిగా లండన్‌ కోర్టును అభ్యర్థించింది. దీంతో స్థానిక పోలీసులు ఓ మెట్రో స్టేషన్‌ లో నీరవ్‌ ను పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు.

* నీరవ్‌ మోదీ ఎవరు..?

గుజరాత్‌ కు చెందిన నీరవ్‌ మోదీ వజ్రాల వ్యాపారి. వారసత్వంగా వచ్చిన ఈ వ్యాపారంలో భాగంగా ఆయన 2.3 బిలియన్‌ డాలర్లు అంటే 230 కోట్ల రూపాయలతో ఫైర్‌ స్టార్‌ డైమండ్‌ అనే సంస్థను ముంబైలో స్థాపించాడు. ఆగ్రదేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించి సంస్థను అగ్రశ్రేణిలో నిలబెట్టాడు. పోర్బ్స్‌ అనే పత్రిక 2016లో విడుదల చేసిన ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో నీరవ్‌ కు 1,067వ ర్యాంకు దక్కింది. ఇక భారత బిలియన్లర్లలో ఆయనకు 46వ వ్యక్తిగా నిలిచాడు. అంతేకాకుండా అతిచిన్న వయసులో పోర్బ్స్‌ జాబితాలో ఎక్కి పలువురి చేత ప్రశంసలు అందుకున్నాడు.

* స్కామ్‌ ఎలా చేశాడు..?

అప్పటికే విజయపతాకంలో దూసుకెళ్తున్న ఫైర్‌ స్టార్‌ డైమెండ్‌ కంపెనీకి అనుగుణంగా నీరవ్‌ మోదీ తన పేరుతో బ్రాండ్‌ ను సృష్టించాడు. దానిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలను వాడుకున్నాడు. నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టిస్తూ బ్యాంకుల వద్ద ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకున్నాడు. తీసుకున్న అప్పులు కట్టకుండా రాజకీయ నేతలతో బెదిరించేవాడు. ఇందులో భాగంగా నీరవ్‌ ఆగడాలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఉన్నతాధికారులు పసిగట్టారు. 12వేల కోట్లు ఎగ్గొట్టి బెదిరిస్తున్నాడని.. 2011 నుంచి జరుగుతున్న ఈ దందాను గుర్తించిన బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.

* ఒక్కొక్కటిగా వెలుగులోకి..

రంగంలోకి దిగిన సీబీఐ -ఈడీ అధికారులు నీరవ్‌ ఆస్తులపై దాడులు మొదలుపెట్టారు. ముంబైలోని ప్రధాన బాంద్రా కూర్లా కాంప్లెక్సులో ఉన్న ఫైర్‌ స్టార్‌ డైమండ్‌ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అదే సమయంలో కుర్లా వెస్ట్‌ లో ఉన్న నీరవ్‌ మోదీ ప్రైవేట్‌ ఆఫీసులో - మిగతా నివాసాలైన కోహినూర్‌ సిటీలో - దక్షిణ ముంబైలో ఉన్న ఇట్స్‌ హౌజ్‌ షోరూంలలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5100 కోట్ల విలువైన వజ్రాలు - ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది.

* భారత్‌ నుంచి పరార్‌..

భారీ మోసాలకు పాల్పడిన నీరవ్‌ ఈడీ దాడులకు ముందే భారత్‌ విడిచి వెళ్లాడు. తన మోసం ఎన్నటికైనా బయటపడుతుందని గ్రహించిన ఆయన 2018 జనవరిలో ఫ్యామిలీతో విదేశాలకు పరారయ్యాడు. దీంతో అప్పటి నుంచి నీరవ్‌ కోసం ఈడీ తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. గత నెలరోజుల నుంచి నీరవ్‌ రకరకాల దేశాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు.

* అంతర్జాతీయ మీడియాతో..

అంతర్జాతీయ మీడియా ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫొటోతో నీరవ్‌ మోడీని కనుగొన్నారు. భారత్‌ లోని బ్యాంకులను మోసం చేసి లండన్‌ వీధుల్లో దర్జాగా తిరుగుతున్నది నీరవ్ మోడీనే అని గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఈడీ నీరవ్‌ ను అరెస్టు చేయాలని లండన్‌ కోర్టును అభ్యర్థించింది. దీంతో అక్కడి అధికారులు నీరవ్‌ మోడీని పట్టుకొని కోర్టులో అప్పగించారు.

* నేను ఉద్యోగిని..: కోర్టులో నీరవ్‌

నీరవ్‌ ను పట్టుకున్న అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఆ సమయంలో నీరవ్‌ మాట్లాడుతూ తాను ఓ సంస్థలో ఉద్యోగినని..దానికి సంబంధించి పే స్లిప్‌ ఇదుగో అని న్యాయవాదులకు చూపించారు. కానీ భారత్‌ లో అంతపెద్ద మోసం చేసిన ఆయన వాదనను లాయర్లు పట్టించుకోలేదు. అంతేకాకుండా ఆయన వేసిన బెయిల్‌ ను తిరస్కరించారు. దీంతో ఇక నీరవ్‌ ఆటకట్టు అని తెలుస్తోంది.