దక్షిణాఫ్రికాలో రోడ్డు ప్రమాదం..తెలుగోళ్లు మృతి

Mon Jul 17 2017 10:21:25 GMT+0530 (IST)

దేశం కాని దేశంలో తెలుగు ప్రజలు ప్రమాదాలకు గురై మరణించటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. గతంలో ఇంత తరచూ ప్రమాదాలు.. మరణాలు చోటు చేసుకునేవి కావు. ఈ మధ్యన వివిధ కారణాలతో తరచూ విదేశాల్లో మనోళ్ల మరణాల గురించి వినాల్సి వస్తోంది.

తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగువాళ్లు మరణించారు. వారిలో ఒకరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాగా.. మరొకరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఇరువురు మరణించారు.

దక్షిణాఫ్రికాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు తెలుగు వారిలో ఒకరు..ఖమ్మం జిల్లా వందనం గ్రామానికి చెందిన అంకిరెడ్డి గోపీకృష్ణ కాగా.. మరొకరు కడపకు చెందిన బసిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (40)గా చెబుతున్నారు. 35 ఏళ్ల గోపీ ఎంబీఏ పూర్తి చేసి ఇరవై రోజుల క్రితమే దక్షిణాఫ్రికాకు వెళ్లారు. జాబ్ కోసం మూడు కంపెనీల్లో  ఇంటర్వ్యూకి హాజరైన ఆయన.. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ నెల 13న దక్షిణాఫ్రికాలోని బెతల్ హాం పట్టణం సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా.. అందులో గోపీకృష్ణ ఒకరు కావటం గమనార్హం. గోపీ.. అతని స్నేహితుడు వెళుతున్న కారును.. ముగ్గురు స్థానిక వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనం వేగంగా వచ్చి ఢీ కొనటంతో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

ప్రమాదానికి కారణమైన దక్షిణాఫ్రియా వ్యక్తులు ప్రయాణిస్తున్న వాహనం కాలిపోవటమే కాదు.. అందులో ప్రయాణిస్తున్న వారు సైతం సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది.  ప్రమాదంలో మరణించిన ఇరువురు తెలుగువారిని వారి స్వప్రాంతాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.