ఇంటర్ బోర్డు పాపం!..మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య!

Thu Apr 25 2019 09:38:58 GMT+0530 (IST)

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల కారణంగా రాష్ట్రంలో బలవన్మరణాలు ఆగడం లేదు. బోర్డు నిర్లక్ష్య ధోరణి కారణంగా విద్యార్థుల మార్కుల్లో భారీ వ్యత్యాసాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న ఆవేదనతో 8 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఈ సంఖ్య పదికి చేరుకుంది. మెదక్ జిల్లాలో ఒకటి - వరంగల్ రూరల్ జిల్లాలో మరో ఆత్మహత్య చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన చాకలి రాజు అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా... వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన మాలోతు నవీన్ వేగంగా పరుగులు తీస్తున్న రైలు నుంచి దూకేసి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఇద్దరి బలవన్మణాలతో ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల సంఖ్య పదికి చేరింది.ఇంటర్ బోర్డు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన కారణంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో పాసైన వారు ఫెయిల్ అయిపోతే... ఫెయిల్ అయిన వారు పాసైపోయారు. పరీక్ష బాగా రాయకున్నా పాసైపోయిన విద్యార్థులు బయటపడిపోయామన్న భావనలో ఉండగా... పరీక్ష బాగా రాసి కూడా ఫెయిల్ అయ్యామన్న ఆవేదనతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో టీడీపీ సీనియర్ నేత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బోర్డు వైఫల్యమేనని పక్కాగా తేలిపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఆందోళనలు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ కూ చేరాయి. కాస్త ఆలస్యంగానే మేల్కొన్న కేసీఆర్... వివాదం పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. రీ కౌంటింగ్ తో పాటు రీ వాల్యూయేషన్ కూడా ఉచితంగానే నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ప్రకటనకు కాస్త ముందుగా రాజు నవీన్ ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం.