టీడీపీ ఎమ్మెల్యేలకు ఓటు వేయడం కూడా రాదా?

Mon Jul 17 2017 16:12:12 GMT+0530 (IST)

రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో అధికార పార్టీ టీడీపీ నిజంగానే సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుగా ఉండి ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పిస్ క్లాస్ విని కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పుగా ఓటేశారట. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగానూ వైరల్ వార్తగా మారిపోయింది. 2-3 లక్షల మంది ఓటర్లకు ప్రజా ప్రతినిధులుగా ఉన్న వీరిద్దరు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగంచడం కూడా రాకపోవడం జనాన్ని నివ్వెరపరచిందనే చెప్పాలి. ఇలా ఎలా ఓటేయాలో చెప్పినా కూడా తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోవడానికి చేతకాని ఎమ్మెల్యేలు ఎవరంటే... ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు ఒకరు కాగా ఇంకొకరు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజవకర్గ ఎమ్మెల్యేగా ఉన్న జితేంద్ర గౌడ్.

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నేటి ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీలో తన పార్టీ ఎమ్మెల్యేలకు ఓటెలా వినియోగించుకోవాలన్న విషయంపై చంద్రబాబు క్లాస్ చెప్పారు. అంతకుముందే... ఓటు హక్కు వినియోగించుకునే తీరుపై ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా సవివరంగానే అవగాహన కల్పించారు. అయితే నేటి ఉదయం చంద్రబాబు చెప్పిన క్లాస్ విన్న తర్వాత పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన కదిరి బాబురావు - జితేంద్ర గౌడ్ లు... తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో బొక్క బోర్లా పడ్డారు. బ్యాలెట్ పత్రాలపై తమ పేర్లను రాసిన వీరిద్దరూ తమ ఓట్లను చెల్లకుండా చేసేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలింగ్ సిబ్బందితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా షాక్ తిన్నారట. అయితే వెనువెంటనే తేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబు చెవిన వేశారు. దీంతో ఎటూ ఎమ్మెల్యేలతో భేటీ ఉంటుంది కదా అప్పుడు చూసుకుందాంలే అనుకున్న చంద్రబాబు... ఆ భేటీ ప్రారంభం కాగానే ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

ఎమ్మెల్యేలుగా ఉంటూ కూడా కనీసం ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా చేత కాలేదంటే ఏమనుకోవాలి అని ఆయన వారిద్దరికీ క్లాస్ పీకారట. అంతేకాకుండా మీరు చేసిన పని షేమ్ గా అనిపిస్తోందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారట. ప్రజా ప్రతినిధులుగా ఉంటూ ఓటు హక్కు వినియోగించుకునే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత ఉన్న మీరే మీ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే... ఇక ప్రజలకేం చెబుతారు? అని కూడా ఆయన వారిని చీవాట్లు పెట్టారట. అసలు ఓటు వినియోగించుకోవడం కూడా రాకుండా ఎమ్మెల్యేలుగా ఎలా గెలిచారని కూడా చంద్రబాబు వారికి అక్షింతలు వేశారట. చేసింది తప్పే కాబట్టి... చంద్రబాబు ఎంతమేర చీవాట్లు పెట్టినా వారిద్దరి నోట నుంచి ఒక్క మాట కూడా పెగల్లేదట. చంద్రబాబు అక్షింతలు వేసినంత సేపు తల కిందకు దించేసుకుని నిలబడ్డారట.