హార్ధిక్ పాండ్యాకు జహీర్ గట్టి కౌంటర్

Wed Oct 09 2019 17:49:56 GMT+0530 (IST)

ఆటతోపాటు వివాదాల్లోనూ యాక్టివ్ గా ఉండే హార్ధిక్ పాండ్యా తాజాగా సీనియర్ క్రికెటర్ జహీర్ ఖాన్ పై చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. తాజాగా క్రికెటర్ జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా హార్ధిక్ పాండ్యా ఓ ట్వీట్ చేశాడు. జహీర్ ఖాన్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన వీడియోను షేర్ చేస్తూ  ‘హ్యాపీ బర్త్ డే జాక్.. నేనిక్కడ కొట్టినట్లు నువ్వు కూడా మైదానం బయట దంచి కొడుతావని ఆశిస్తున్నా’ అని పేర్కొంటూ దేశవాళి మ్యాచ్ వీడియోను జోడించాడు..ఇది చూసిన నెటిజన్లు హార్థిక్ పై ట్రోల్స్ మొదలు పెట్టారు. సీనియర్ ఆటగాడికి నువ్విచ్చే గౌరవం ఇదేనా.. ముందు ఆటపై దృష్టిపెట్టు వివాదాలపై కాదు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. హార్ధిక్ ది అహంకారం అని ఘాటు విమర్శలు చేశారు..

ఈ వివాదంపై జహీర్ ఖాన్ కూడా గట్టిగానే స్పందించాడు. ‘ముందుకుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు హార్ధిక్ కు ధన్యవాదాలు.. అయితే నీలా బ్యాటింగ్ నేనెప్పటికీ చేయలేను. కానీ నువ్వు నా నుంచి ఎదుర్కొన్న తర్వాతి బంతి లాగానే నా పుట్టినరోజు బాగా జరిగింది’ అంటూ జహీర్ ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. ఇలా హార్ధిక దూకుడుపై అటు నెటిజన్లు ఇటు జహీర్ పంచ్ లు ఇచ్చి ఉక్కిరిబిక్కిరి చేశారు.