మేమూ - మీరూ... ఎప్పుడూ నెం.1

Tue Jan 01 2019 12:28:02 GMT+0530 (IST)

365 ... ఇది ఒక కాల చక్ర సమయం. ప్రతి కాలచక్రం మనలో ఒక అంతర్మథనం వదిలి వెళ్తుంది. ఆలోచనలో పడేస్తుంది. మనల్ని ఒకసారి వెనక్కు తిరిగి చూసుకునేలా చేస్తుంది. ఈరోజుతో మన జీవితంలో ఒక కాలచక్రం ముగిసింది. ఈపాటికే మనలో మనకు ఒక అంతర్మథనం ముగిసి కొత్త ఆశలతో రేపటి నుంచి కొత్త జీవితం ఎలా ప్రారంభించాలో అని ఒక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం. సరే...అవి నెరవేరుతాయా? నెరవేరవా అన్నది వేరే విషయం. హోప్ అనేది మనిషిని నిలబెట్టేది. కాబట్టి భవిష్యత్తు ఫలితాలతో సంబంధం లేకుండా మన ప్రణాళికలు కొనసాగుతాయి.కొత్త ఆశలతో - కొత్త కలలతో - కొత్త లక్ష్యాలతో ప్రతి ఏడాది తుపాకి లాగే తుపాకి పాఠకులు కూడా కార్యోన్ముఖులై జీవిత యుద్ధానికి బయలుదేరుతున్నారు. మీ అందరి అశేషమైన అండదండల కారణంగా తుపాకి గత ఏడాదే ఒక శిఖరం చేరుకుంది. భారతదేశంలో వెబ్ జర్నలిజం(దిన పత్రికలు మినహాయిస్తే) భారతదేశంలో నెం.1 స్థానంలో నిలిచింది.  ఒక కాలచక్రం తిరిగినా తుపాకి దానిని నిలబెట్టుకుంది. ఇప్పటికీ తుపాకిది తెలుగు జర్నలిజంలో ఉన్న న్యూస్ పోర్టల్స్ లో (పత్రికలు కాకుండా) భారత దేశంలో నెం.1 స్థానం. 

మా ప్రయత్నం మీకు నచ్చింది. అయితే పలుమార్లు మేము కొన్ని చిరు దోషాలకు పాల్పడి ఉండొచ్చు. అక్షరం గమనం కూడా కాపురం వంటిదే - అక్కడ అలకలు - కలతలు లాగే ఇక్కడా కొన్ని పొరపాట్లు - తొట్రుపాట్లు ఉంటాయి. మినహా జర్నలిజంలో కచ్చితత్వానికి - నిగ్గదీసి అడగడానికి - ప్రశ్నించేందుకు - వివరించేందుకు తుపాకి సదా సిద్ధంగా ఉంటుంది. అందుకే మేమంటే మీకి అభిమానం. మీ అభిమానమే మా ఎదుగుదల.

ఈ నెం.1 స్థానం అనేది టీవీలలో వచ్చే కమర్షియల్ యాడ్‌లాంటిది కాదు... మేమే నెం.1 - మేమే నెం.1 అని చెప్పడానికి. ఇది ప్రపంచంలోనే ఒక అత్యున్నత ఆదరణ - విశ్వాసం సంపాదించుకున్న అమెజాన్ సంస్థ నిర్వహిస్తున్న అలెక్సా ఇచ్చిన ర్యాంకింగ్ లో మాకు వచ్చిన స్థానం. ఈరోజు అనగా డిసెంబరు 31న తుపాకి అలెక్సా ర్యాంకు 222 (నిన్నటికి - రేపటికి అంకెల్లో కొంచెం తేడా ఉన్నా స్థానం మాత్రం అదే). మమ్మల్ని శిఖరం చేర్చిన మా పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ నూతన ప్రణాళికలన్నీ ఉత్తమ ఫలితాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మాకు నెం.1 స్థానం అందించిన మీకు సర్వదా  కృతజ్ఞతలు.

వినమ్రంగా
తుపాకి యాజమాన్యం.