ట్రంప్ పదవి ఊడబీకేయడంపై బెట్టింగ్ లు!

Fri May 19 2017 10:01:44 GMT+0530 (IST)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కొత్త చర్చ మొదలైంది. అదే ఆయన పూర్తి కాలం పదవిలో కొనసాగుతారా? లేక అర్ధంతరంగా నిష్క్రమిస్తారా? అనే సందేహం. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ ను అమెరికన్ కాంగ్రెస్ అభిశంసించనుందన్న అంశంపై అనుకూల - ప్రతికూల వాదనలతో గత రెండు రోజులుగా ఇప్పుడు ఆన్ లైన్ లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది. `ప్రెడిక్ట్ ఇట్` వంటి ఆన్ లైన్ రాజకీయ స్టాక్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఎఫ్ బిఐ డైరెక్టర్ జేమ్స్ కామీకి ట్రంప్ అర్ధంతరంగా ఉద్వాసన పలికిన వివాదం నేపథ్యంలో ఈ ఆన్ లైన్ బెట్టింగ్ నానాటికీ విస్తరిస్తోంది.

బ్రిటన్ కు చెందిన మరికొందరు ఔత్సాహికులు ట్రంప్ తన పదవీ కాలం పూర్తయ్యే 2021 వరకూ అధికారంలో వుంటారా? ఉండరా అన్న అంశంపై బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురవుతారా? అన్న అంశంపై గడచిన 24 గంటల వ్యవధిలోనే దాదాపు లక్షకు పైగా కాంట్రాక్ట్ లు `ప్రెడిక్ట్ ఇట్`కు చేరాయి. వైట్ హౌస్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ కు రష్యాకు మధ్య సంబంధాలపై ఎఫ్ బిఐ కొనసాగిస్తున్న దర్యాప్తును అర్ధంతరంగా నిలిపివేయాలని ట్రంప్ తనకు చెప్పినట్లు కామీ అమెరికన్ కాంగ్రెస్ కు లిఖితపూర్వకంగా వెల్లడించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ కాంట్రాక్ట్ ల వెల్లువ ఊపందుకుంది. బుధవారం ఒక సమయంలో ఈ అభిశంసన ప్రశ్నకు 'అవును' అన్న జవాబుతో రికార్డు స్థాయిలో 33 సెంట్ల ధరకు కాంట్రాక్ట్ లు దాఖలయ్యాయి. అంటే ట్రంప్ అభిశంసనకు గురయ్యే అవకాశాలు 33 శాతం మేర ఉన్నట్లు ఈ ట్రేడింగ్ ద్వారా తెలుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. గత వారం రోజుల క్రితం అభిశంసన కేవలం 7 శాతం మాత్రమే వుండటం విశేషం. అయితే బుధవారం సాయంత్రానికి ఈ ట్రేడింగ్ 27 శాతానికి పడిపోగా అంతకు ముందు రోజు మంగళవారం సాయంత్రం 24 శాతం వద్ద ముగిసింది.

`ప్రెడిక్ట్ ఇట్` ఆన్ లైన్ రాజకీయ స్టాక్ మార్కెట్ ను వాషింగ్టన్ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ అరిస్టాటిల్ - న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లోని విక్టోరియా యూనివర్శిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ స్టాక్ మార్కెట్ వినియోగదారులంతా అమెరికాలో అర్హులైన ఓటర్లే కావటం విశేషం. మొత్తమ్మీద ట్రెగ్జిట్ కు సంబంధించిన ఈ ట్రేడింగ్ దాదాపు 2.7 లక్షల డాలర్లకు పైగా ధర పలకటం గమనార్హం. కాగా బ్రిటిష్ బెట్టింగ్ సంస్థ లాడ్ బ్రోక్స్ ట్రంప్ అభిశంసన కాంట్రాక్ట్ ధరను 11-10 పౌండ్ల నుండి 4-5 పౌండ్ల స్థాయికి తగ్గించటంతో ట్రంప్ అభిశంసనకు 56 శాతం మేర అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వెలువడ్డాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/