Begin typing your search above and press return to search.

ట్రంప్ ఎంత క‌ర్క‌శుడో మ‌ళ్లీ నిరూపించాడు

By:  Tupaki Desk   |   20 Jun 2018 5:40 AM GMT
ట్రంప్ ఎంత క‌ర్క‌శుడో మ‌ళ్లీ నిరూపించాడు
X
మొండిప‌ట్టును..ప‌ట్టువిడ‌వ‌ని మూర్ఖ‌పు విధానాల‌కు పెట్టింది పేర‌యిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న క‌ర్క‌శ‌త్వాన్ని మ‌రో విష‌యంలో నిరూపించుకుంటున్నారు. సరిహద్దుల నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న వలసదారులను పట్టుకొని జైళ్లో వేసి - వారి నుంచి వారి పిల్లలను వేరు చేస్తున్న అమెరికన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా నిర్బంధ గృహాల్లోని పిల్లలు ఏడుస్తున్న హృదయ విదారకమైన ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. తమకు అమ్మానాన్నలు కావాలని వారు రోదిస్తున్న తీరు ఎంతటి పాషాణ హృదయులనైనా కరిగిపోయేలా చేస్తోంది. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అమెరికాను శరణార్థి శిబిరంగా మార్చబోనని తన మొండి పట్టుదలను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఆయ‌న తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు కూడా చేశారు.

బీబీసీ వెలువ‌రించిన ఓ క‌థ‌నం ప్ర‌కారం ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ త‌ల్లిదండ్రుల నుంచి పిల్ల‌ల‌ను వేరు చేయ‌డ‌మే అక్ర‌మ వ‌ల‌స‌ల‌కు ఏకైక మార్గ‌మ‌న్నారు. అక్ర‌మంగా త‌మ దేశంలోకి వ‌చ్చేవారిని అడ్డుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లించ‌లేద‌ని అందుకే చివ‌ర‌గా ఈ మార్గాన్ని ఎంచుకున్నామ‌న్నారు. అక్ర‌మ వ‌ల‌స‌ల రూపంలో వ‌చ్చిన వాళ్ల‌ను విడ‌దీయాల‌నే ఉద్దేశ‌మేమీ లేదు. అయితే అలాంటి వారు జైల్లో ప‌డిన‌ప్పుడు వారి పిల్లల‌ను విడ‌దీయ‌డం ఒక్క‌టే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా తోస్తోంది. ఇలా చేయ‌డ‌మే భ‌విష్య‌త్‌ లో వ‌ల‌స‌ల‌ను అడ్డుకునేందుకు ప‌రిష్కార‌మార్గంగా తోస్తోంది.`` అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కాగా, నిర్బంధ గృహాల్లో ఉన్న కొంతమంది చిన్నారుల వద్ద వారి బంధువులకు సంబంధించిన ప‌రిస్థితులు ఇప్పుడు అమెరికాను కుదిపేస్తున్నాయి. ఆ చిన్నారుల వ‌ద్ద తల్లిదండ్రుల‌ ఫోన్‌నంబర్లు ఉన్నాయి. తమ బంధువులకు ఫోన్ చేయాలని వారు అధికారులను వేడుకుంటున్నారు. అమెరికాకు చెందిన ప్రోపబ్లికా అనే పరిశోధనాత్మక మీడియా సంస్థ పిల్లలు ఏడుస్తున్న ఒక ఆడియో రికార్డును సంపాదించింది. ఎనిమిది నిమిషాల నిడివి కలిగిన చిన్నారుల ఆడియో యావత్ అమెరికాను ఊపేస్తున్నది. పిల్లలను నిర్బంధిస్తున్న దృశ్యాలతో ఇప్పటికే విసుగెత్తిపోయిన ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రెండేండ్ల చిన్నారులను కూడా వదలకుండా జంతువులను బంధించినట్టు బోన్ల వంటి గదుల్లో వేస్తున్నారని మండిపడుతున్నారు.

ఇదిలాఉండ‌గా... జైల్లో ఉన్న‌ పిల్లల వద్ద ఉన్న ఓ నంబర్‌కు మీడియా ప్రతినిధులు ఫోన్ చేశారు. సదరు చిన్నారి బంధువులు ఒకరు మాట్లాడుతూ ``ఇది నా జీవితంలో అత్యంత బాధాకమైన సమయం. మీ ఆరేళ్ల‌ మేనకోడలు నుంచి ఏడుస్తూ ఫోన్ వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. తనను అక్కడి నుంచి తీసుకెళ్లాలని ఆ చిన్నారి ఏడుస్తూ అర్థిస్తోంది. తాను ఒంటరిగా ఉన్నాని భయంతో వణికిపోతోంది`` అని చిన్నారి మేనత్త బాధాతప్త హృదయంతో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.