యునెస్కోపై ట్రంప్ అలిగారు.. ఎందుకంటే?

Fri Oct 13 2017 11:33:50 GMT+0530 (IST)

అగ్రరాజ్యం అలిగింది. తాను కీలకంగా వ్యవహరించి ఏర్పాటు చేయించిన యునెస్కో నుంచి తాజాగా తానే బయటకు వచ్చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల్లో శాంతి స్థాపన కోసం.. రక్షణ కోసం కృషి చేసేందుకు వీలుగా అంతర్జాతీయంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో యునెస్కోను ఏర్పాటు చేశారు.ఎన్నో చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకు.. విద్య.. సాంస్కృతిక సంరక్షణ తదితర అంశాల మీద పని చేసే ఈ అంతర్జాతీయ సంస్థ నుంచి వైదొలిగేందుకు అమెరికా డిసైడ్ అయ్యింది.

ఎందుకిలా? అన్న ప్రశ్న వేసుకుంటే.. దీని వెనుక చాలానే విషయాలు ఉన్నాయని చెప్పాలి. తాను మద్దతు ఇచ్చే ఇజ్రాయల్ ను పట్టించుకోవటం లేదని.. వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని.. తాను వ్యతిరేకించే పాలస్తీనాకు మద్దతు ఇవ్వటాన్ని తప్పు పడుతూ యునెస్కో నుంచి బయటకు వస్తున్న సంచలన నిర్ణయాన్ని అమెరికా ప్రకటించింది.

ఇజ్రాయల్.. పాలస్తీనా మధ్య నడుస్తున్న రచ్చ ఇప్పటిది కాదు. తాజాగా  యునెస్కో నుంచి అమెరికా వైదొలగటంలోనూ ఈ ఇష్యూ ఉంది. 2011లో తాను వ్యతిరేకించే పాలస్తీనాకు సభ్యత్వం ఇవ్వటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి నుంచి యునెస్కోకు నిధులు పంపటం ఆపేసింది. ఇదే సమయంలో కొంతకాలంగా ఇజ్రాయల్ వ్యతిరేక విధానాల్ని అనుసరించటం అమెరికాకు ఆగ్రహంగా ఉంది.

ఐక్యరాజ్యసమితి మీద తన పట్టును మరింత పెంచుకోవాలని.. ఐక్యరాజ్యసమితిలో మిగిలిన అనుబంధ సంస్థలు తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా నిర్ణయాలు తీసుకుంటే.. ఎలాంటి నిర్ణయానికైనా తాము సిద్ధమన్న విషయాన్ని స్పష్టం చేసేందుకే తాజా నిర్ణయంగా చెబుతున్నారు. అమెరికా  నిర్ణయం పట్ల యునెస్కో తీవ్ర దిగ్బాంత్రిని వ్యక్తం చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యునెస్కో కొత్త డైరెక్టర్ కోసం ఓటింగ్‌కు వెళుతున్న వేళలో అమెరికా ఈ తరహా నిర్ణయం తీసుకోవటం విశేషం. అమెరికా ఈ తరహాలో నిర్ణయాలు తీసుకోవటం కొత్తేం కాదు. పర్యావరణ దినోత్సవానికి కొద్ది రోజులు ముందు ప్యారిస్ ఒప్పందాన్ని తూచ్ అంటూ తప్పుకోవటం మర్చిపోకూడదు. నిజానికి ట్రంప్ ఒక్కడే కాదు.. అంతకు ముందు కూడా ఇదే తీరులో అలిగి.. వైదొలగిన ఘన చరిత్ర అమెరికాకు ఉంది. 1984లో ఇదే యునెస్కో నుంచి అమెరికా వైదొలుగుతూ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో చేసిన ఆరోపణ ఏమిటంటే.. సోవియెట్ యూనియన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించింది. జస్ట్ దేశం పేరు మారిందే తప్ప అమెరికా తీరు ఎప్పటిలానే ఉందని చెప్పక తప్పదు. తన ప్రయోజనాల ముందు మిగిలినవేమీ పట్టించుకోని అగ్రరాజ్యంగా అమెరికాను చెప్పక తప్పదు.