Begin typing your search above and press return to search.

హెచ్‌4వీసా...ట్రంప్ ఇచ్చిన తాజా షాక్ ఇది

By:  Tupaki Desk   |   18 Oct 2018 6:31 PM GMT
హెచ్‌4వీసా...ట్రంప్ ఇచ్చిన తాజా షాక్ ఇది
X
అమెరికాలో నివ‌సిస్తున్న భార‌తీయుల‌కు మ‌రో షాకింగ్ వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెళ్లిన‌ భారతీయ నిపుణులకు ఇటీవ‌లి కాలంలో చేదువార్త‌ల‌ను అందిస్తున్న అమెరికా ఈ క్ర‌మంలో మ‌రింత షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అందజేసే హెచ్-4 వీసా నిబంధనల్లో మార్పులు చోటుచేసుకునే అవ‌కాశం ఉంద‌ని షాకింగ్ వార్త‌ను తెర‌మీద‌కు తెచ్చింది. హెచ్‌4 వీసా నిబంధనను ర‌ద్దు చేసే అవ‌కాశం ఉన్నట్లు ట్రంప్ స‌ర్కారులో కీల‌క స్థానంలో ఉన్న అధికారులు సిద్ధ‌మ‌య్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు సార్లు వాయిదా వేసిన హెచ్‌ 4 వీసాల రద్దుపై అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్ఎస్‌) తన అజెండాలో హెచ్‌ 4 వీసాల రద్దు ప్రతిపాదనను చేర్చింది.

హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు పని చేసేందుకు వీలు కల్పిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆదేశాల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ క‌న్నెర్ర చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వెసులుబాటు వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గిపోయాయని అందువల్ల హెచ్‌4 వీసాదారులకు వర్క్‌ పర్మిట్‌ను రద్దు చేస్తామని ఈ ఏడాది ఫ్రిబ్రవరి 28న ట్రంప్‌ సర్కార్‌ ప్రకటించింది. గత జూన్‌లోనే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. వాయిదా పడింది. అనంత‌రం మ‌రో 3 నెలల్లో వర్క్‌ పర్మిట్‌ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని ట్రంప్‌ యంత్రాంగం పేర్కొంది. ఈ ప్ర‌క్రియ తాజాగా ముందుకు ప‌డింది. ఇప్పటికి మూడుసార్లను నోటిఫికేషన్ జారీని వాయిదా వేసిన అమెరికా.. ఈసారి మాత్రం కచ్చితంగా జారీ చేసే అవకాశముంది. అమెరికన్లకు ఉపాధి అవకాశాలు పెంచే ఉద్దేశంతో అమెరికా హెచ్‌ 4వీసాలను రద్దు చేయాలని నిర్ణయించిన‌ప్ప‌టికీ దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను మాత్రం విడుదల చేయలేదు. యునిఫైడ్‌ ఫాల్‌ అజెండాను బుధవారం డీమెచ్ఎస్‌ విడుదల చేసింది. హెచ్‌ 4 వీసాల రద్దుతో స్థానిక అమెరికన్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని డీహెచ్ఎస్‌ పేర్కొంది. అయితే, ఈ నిర్ణ‌యం హెచ్‌4 వ‌ర్గ‌ల‌కు శ‌రాఘాతంగా మారింది.

2014 డిసెంబర్‌ 25వ తేదీనాటికి హెచ్‌ 4 వీసా 1,26,853 మందికి జారీ చేశారు. వీరిలో 70,000 మంది భారతీయులు ఉన్నారు. కాగా, అమెరికా ప్ర‌తిపాద‌న‌ల‌పై అన్నివ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కొద్దికాలం క్రితం దీనిపై అమెరికా ప్ర‌జాప్ర‌తినిధులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాలిఫోర్నియాకు చెందిన భారత సంతతి సెనెటర్‌ కమలా హ్యారిస్‌తో పాటు న్యూయార్క్‌కు చెందిన క్రిస్టీన్‌ గిల్లిబ్రాండ్‌ సంయుక్తంగా యూఎస్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్ట్‌జెన్‌ నిల్సన్‌, యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌కు ఈ లేఖ రాశారు. హెచ్‌-4 వీసాదారుల వర్క్‌ పర్మిట్‌ను రద్దు చేయడం వల్ల ఆ ప్రభావం దాదాపు లక్ష మంది మహిళలు, వారి కుటుంబాలపై పడే అవకాశం ఉందని ట్రంప్‌ యంత్రాగానికి సెనెట‌ర్లు లేఖ రాశారు. `హెచ్‌-4 వీసాదారుల వర్క్‌పర్మిట్‌ను రద్దు చేయడం వల్ల దానిపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. వృత్తిపరంగానే కాకుండా కుటుంబపరంగానూ కష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగాలు లేకపోవడం వల్ల వారంతా తీవ్ర నిరాశలో కూరుకుపోతారు. తమపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. భార్యలు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఆమెతో పాటు వారి చిన్నారులు కూడా భర్త మీదే ఆధారపడాల్సి ఉంటుంది. దీని వల్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హెచ్‌-4 రద్దు కారణంగా మహిళల ఆర్థిక, మానసిక పరిస్థితితో పాటు వ్యక్తిగతంగానూ కలత చెందుతారు. ఇది అత్యంత ప్రమాదకరం. దాదాపు లక్ష మంది మహిళా ఉద్యోగులు, వారి కుటుంబాలు, వారి అమెరికన్‌ కమ్యూనిటీలు దీని వల్ల ప్రభావితులవుతారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని హెచ్‌-4వీసాను రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం`` అని ఆ లేఖ‌లో వారు కోరారు. అయిన‌ప్ప‌టికీ, త‌దుప‌రి ప్ర‌క్రియలో భాగంగా హెచ్‌4 ర‌ద్దు చేశారు.